మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Feb 26, 2020 , 23:34:41

పట్టణ ప్రగతిలో.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పట్టణ ప్రగతిలో.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పరిగి రూరల్‌: పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్‌ పౌసుమి బసు ప్రజలను కోరారు. పట్టణ ప్రగతిలో భాగంగా కలెక్టర్‌ బుధవారం పరిగి మున్సిపల్‌ పరిధిలోని 2,4,5 వార్డుల్లో పర్యటించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ఆమె పనులను పరిశీలించి వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ పనుల నిర్వహణ సంక్రమంగా లేకపోవడం పట్ల ఆమె మున్సిపల్‌, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న మిషన్‌ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వేసవిలో వార్డులో మంచినీటి ఎద్దాడి రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. ప్రధానంగా పారిశుధ్యం, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ పనులతో పాటుగా తదితర మౌలిక వసతుల కల్పన అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. పట్టణ ప్రగతిలో వచ్చిన ప్రత్యేక నిధులతో ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. 


వార్డులో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా తడి, పొడి చేత్త వేరు చేసి మున్సిపల్‌ వాహనాల్లోనే వేయాలని కాలనీవాసులకు ఆమె సూచించారు. ఖాళీ స్థలాలల్లో చేత్తను ఎక్కడ పడితే అక్కడ వేసిన వారిపైన జరిమానాలు విధిస్తామని ఆమె హెచ్చరించారు. ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను శుభ్రం చేయించాలని, ముళ్లపోదాలను తొలగించాలని ఆమె వారికి సూచించారు. అధికారులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ కల్లు ప్రసన్నలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ తేజీరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆర్‌. ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కల్లు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, సురేందర్‌, రవికుమార్‌, కౌన్సిలర్లు అర్చణకుమారి, వార్ల రవీంద్ర, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo