శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 25, 2020 , 23:53:44

45 హెక్టార్లలో అర్బన్‌ పార్కు

45 హెక్టార్లలో అర్బన్‌ పార్కు
 • తాండూరులో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు
 • గొట్లపల్లి అంతారం ఫారెస్ట్‌లో అర్బన్‌ పార్కు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌
 • ప్రతిపాదనలు సిద్ధం చేసిన జిల్లా అటవీ శాఖ అధికారులు
 • రూ.3.30 కోట్లతో గొట్లపల్లి అంతారంలో అర్బన్‌ పార్కు
 • గొట్లపల్లి అంతారం అటవీ ప్రాంతాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటన
 • ఇప్పటికే 1.40 కోట్ల పనులకు టెండర్ల ఆహ్వానం
 • రెండేండ్ల క్రితం తాండూరులో..
 • క్యూబిక్‌ మీటర్‌కు 622 మిల్లీ గ్రాముల కాలుష్యం
 • అప్పట్లో దేశంలోనే ఢిల్లీ తర్వాత తాండూరులోనే అధిక కాలుష్యం నమోదు
 • తాండూరు పట్టణం మీదుగా రోజుకు 5 వేల లారీల రాకపోకలు
 • వందల సంఖ్యలో నాపరాళ్ల గనులు, సిమెంట్‌ ఫ్యాక్టరీలతోనే అధిక కాలుష్యం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తాండూర్‌ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే తాండూర్‌లో మోతాదుకు మించి కాలుష్యం పెరిగిపోతుండడంతో నియంత్రణ చర్యలు చేపట్టారు. తాండూర్‌ పట్టణానికి చుట్టూ పక్కల వందల సంఖ్యల్లో ఉన్న నాపరాతి, సిమెంట్‌ పరిశ్రమలతో వెలువడే అధిక కాలుష్యానికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం అర్బన్‌ పార్కును (పట్టణ ఉద్యానవనం) ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఇప్పటికే రింగ్‌రోడ్డును మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అర్బన్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే తాండూరు పట్టణానికి 4 కిలోమీటర్ల సమీపంలోని గొట్లపల్లి అంతారం అటవీ ప్రాంతంలో పట్టణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అర్బన్‌ పార్కు ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తి కావడంతోపాటు పలు పనులకు సంబంధించి టెండర్లను కూడా సంబంధిత అధికారులు ఆహ్వానించారు. రూ.3.30 కోట్లతో గొట్లపల్లి అంతారం అటవీ ప్రాంతంలో అర్బన్‌ పార్కు ఏర్పాటు మిగతా పనులకు సంబంధించి త్వరితగతిన టెండర్లను ఆహ్వానించి వీలైనంతా త్వరగా పనులు ప్రారంభించేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు పనులు ప్రారంభించిన ఏడాదిలోగా అర్బన్‌ పార్కును అందుబాటులోకి తీసుకువచ్చి, తాండూర్‌లో కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు గొట్లపల్లి అంతారం అటవీ ప్రాంతాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా కూడా అటవీ శాఖ ప్రకటించింది.


పట్టణానికి 4 కి.మి. దూరం అర్బన్‌ పార్కు.. 

తాండూర్‌ పట్టణానికి 4 కిలోమీటర్ల సమీపంలో అర్బన్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు. తాండూర్‌ నుంచి జహీరాబాద్‌, సంగారెడ్డి, సదాశివపేట్‌ వెళ్లే దారిలోని గొట్లపల్లి అంతారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 45 హెక్టార్లలో పట్టణ ఉద్యానవనాన్ని ఏర్పాటుకు నిర్ణయించారు. సంబంధిత ఉద్యానవనంలో కాలుష్యాన్ని నియంత్రించే ఔషధ మొక్కలతోపాటు మూలికా మొక్కలు, అలంకార మొక్కలతోపాటు తదితర మొక్కలతో కూడిన ఉద్యానవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే అర్బన్‌ పార్కులో యోగా చేసేందుకు ప్రత్యేకంగా షెడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఓపెన్‌ జిమ్‌, పిల్లలు ఆడుకునే పరికరాలు, అడ్వెంచెరల్‌ ఆటలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా సంబంధిత అర్బన్‌ పార్కులో రాశివనం, నక్షత్ర వనాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. అయితే మొత్తం రూ.3.30 కోట్లతో గొట్లపల్లి అంతారం అటవీ ప్రాంతంలో అర్బన్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పూర్తికాగా రూ.1.41 కోట్ల పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన అటవీ శాఖ అధికారులు, మిగతా పనులకు సంబంధించి నిధులు విడుదలైన వెంటనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభించనున్నారు. 45 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న అర్బన్‌ పార్కు చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసే పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించారు. 


తాండూరులో మోతాదుకు మించి కాలుష్యం 

రెండేండ్ల క్రితం ఢిల్లీ కంటే రెట్టింపు స్థాయిలో తాంండూరులో కాలుష్యం ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి నివేదికల్లో స్పష్టమయింది. దీంతో తగు చర్యలు తీసుకోవడంతో కొంతమేర తాండూరులో కాలుష్యం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం మళ్లీ అదేస్థాయిలో కాలుష్యం పెరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే రెండేండ్ల క్రితం తాండూరు పట్టణంలో రికార్డు స్థాయిలో 622 మిల్లీ గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. ఏడాది క్రితం కాలుష్యం తీవ్రత 178 మిల్లీ గ్రాములకు తగ్గినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం సాధారణ స్థాయి కంటే అధికంగానే ఉన్నట్లు గుర్తించారు. జాతీయ వాయు ప్రమాణాల సూచిక ప్రకారం సాధారణంగా వాయువులో ఒక క్యూబిక్‌ మీటర్‌కు 100 మిల్లీ గ్రాముల కాలుష్యం మోతాదు మాత్రమే ఉంటే ప్రజల ఆరోగ్యానికి హాని కలగదు. అయితే అంతకు మించి కాలుష్యం ఉంటే ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అయితే  తాండూరు పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో కాలుష్యం మోతాదుకు మించి ఉన్నట్లు ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నియమించిన కమిటీ నివేదికలో పేర్కొంది. తాండూరు పట్టణ పరిసరాల్లో 15 నుంచి 20 కిలో మీటర్ల పరిధిలో ఐదు సిమెంట్‌ కర్మాగారాలు ఉండడంతో పాటు వందల సంఖ్యలో పాలిషింగ్‌ యూనిట్లు, నాపరాల్ల క్వారీలు, సుద్ద గనులు, ల్యాటరైట్‌ గనులు ఉన్నాయిద. పట్టణం మీదుగా ప్రతి రోజు 5 వేల లారీలతోపాటు ఇతర వాహనాలు వస్తూ, పోతుంటాయి. 


సిమెంట్‌ కర్మాగారాలకు ప్రతిరోజూ బొగ్గును, రాళ్లను, ల్యాటరైట్‌ను(ఎర్రమట్టిని) చేరవేసే లారీలు వందల సంఖ్యలో తిరుగుతుండడంతో పట్టణంలో కాలుష్యం అధికమవుతుండడంతోపాటు  రోడ్లు దారుణంగా తయారవుతున్నాయి. పట్టణానికి చేరువలో రెండు స్టోన్‌ క్రషర్‌ యూనిట్లు, నాలుగైదు సుద్ద ప్యాక్టరీలు కూడా ఉండడంతో కాలుష్యం మోతాదుకు మించి అంతకంతకు పెరుగుతుంది. అయితే ప్రధానంగా తాండూరు పరిసరాల్లో వందల సంఖ్యలో ఉన్న నాపరాళ్ల పాలిషింగ్‌ యూనిట్లతో తాండూరు పట్టణంలో కాలుష్యం పెరుగుతుంది. తాండూరు పట్టణం పరిసరాల్లో దాదాపు 800 పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ పాలిషింగ్‌ యూనిట్లలో కనీసం 400 లారీల నాపరాళ్లను పాలిష్‌ చేస్తున్నారు. వీటిని పాలిషింగ్‌ చేసే ముందుగా గనుల నుంచి తీసుకువచ్చిన నాపరాళ్ల పలకలను తగిన సైజులలో కోత యంత్రాల సహయంతో కోస్తారు. దీంతో పెద్ద ఎత్తున వ్యర్థాలు మిగులుతాయి. ప్రతి పాలిషింగ్‌ యూనిట్‌లో కనీసం రోజుకు 5 నుంచి 10 టన్నుల వరకు వ్యర్థాలు వెలువడుతున్నాయి. దీంతో పట్టణ పరిధిలో ప్రతిరోజూ కనీసం 8  నుంచి 10 వేల వరకు టన్నుల వ్యర్థాలు పారవేయడం ఆనవాయితీగా మారింది. ఈ వ్యర్థాల కారణంగా తాండూరు పట్టణ పరిసరాల్లోని ప్రధాన ఆర్‌అండ్‌బి రహదారులు త్వరగానే పాడవుతుండడంతోపాటు అధిక మొత్తంలో కాలుష్యం వెలువడుతుండడం తాండూరు ప్రజలకు ప్రమాదకరంగా మారింది. 


logo