బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Feb 25, 2020 , 23:52:52

మున్సిపల్‌ ముఖ చిత్రంలో మార్పుకనిపించాలి

మున్సిపల్‌ ముఖ చిత్రంలో మార్పుకనిపించాలి

తాండూరు, నమస్తే తెలంగాణ: తెలంగాణ సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన పదిరోజుల పట్టణ ప్రగతితో మున్సిపల్‌ పరిధి ముఖ చిత్రంలో మంచి మార్పు రావాలని, అందుకు వార్డులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ పౌసుమి బసు సూచించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని 16, 17, 11 వార్డులతో పాటు పలు కాలనీలను, డంపింగ్‌యార్డు, చిలుకవాగు నాలాను కలెక్టర్‌ పౌసుమి బసు, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో పాటు పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌  కౌన్సిలర్లు పరిశీలించారు. పాత తాండూరు మురుగు కాలువల్లో పేరుకు పోయిన చెత్త, మరుగుదొడ్లు లేని ఇండ్లను చూసి సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత తాండూరుతో పాటు తాండూరు మున్సిపల్‌ పరిధిల్లోని 36 వార్డుల్లో ఉన్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పారిశుధ్యం, మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణ ప్రణాళిక కాలవ్యవధిలోనే సమస్యలు పరిష్కరించాలన్నారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా తడి, పొడి చెత్తను వేరుగా కేవలం మున్సిపల్‌ వాహనాల్లోనే వేయాలని సూచించారు. ప్రతి ఇంటికి మరుగు దొడ్డి ఖచ్చితంగా ఉండాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసిన, మలమూత్ర విసర్జన చేసిన జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇనుప విద్యుత్‌ స్తంభాలు తీసి సిమెంట్‌ స్తంభాలు వేసి విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు.


 సమగ్రాభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి 

సీఎం కేసీఆర్‌ పట్టణాల సమగ్రాభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని  కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. తాండూరు మున్సిపల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నామని తెలిపారు. దీంతో మున్సిపల్‌లో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. అందుకు వార్డుల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుతో పాటు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ముఖ్యంగా పట్టణంలోని పారిశుధ్య చర్యలను సంపూర్ణంగా నిర్వహించడం లక్ష్యంగా సాగుతుందన్నారు. అలాగే విద్యుత్‌, నీరు, పరిసరాల పరిశుభ్రత తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అందుకు మున్సిపల్‌ పాలకవర్గంతో పాటు పార్టీలకతీతంగా అందరూ ముందుకు వచ్చి పట్టణ ప్రగతిలో పాల్గొనాలన్నారు. పట్టణ ప్రగతిలో వచ్చిన ప్రత్యేక నిధులతో ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. మున్సిపల్‌ డంపింగ్‌యార్డులో కూడా అనేక మార్పులు చేశామని తెలిపారు. అవసరమైతే మరో స్థలాన్ని కూడా చూడాలన్నారు. పార్కులపై కూడ ప్రత్యేక దృష్టి సారించి బాగు చేస్తామన్నారు. 


logo