శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 25, 2020 , 23:49:13

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : వికారాబాద్‌ జిల్లా వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు (67) మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతి చెందారు. అనారోగ్యంతో సోమవారం అర్ధరాత్రి 1 గంటలకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటుండగానే గుండెపోటు రావడంతో మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సంజీవరావు నవాబుపేట మండల పరిధిలోని గేటువనంపల్లి గ్రామంలో జూలై 1, 1953లో జన్మించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగి (వ్యవసాయాధికారి, ఎంపీడీవో)గా కొంతకాలం పని చేశారు. 1994లో రాజకీయ అరంగేట్రం చేసి వికారాబాద్‌ ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 1995లో వికారాబాద్‌ నగర పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999 వరకు సర్పంచ్‌గా కొనసాగారు. (1999, 2004 శాసన సభ ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి ఆయన సతీమణి మధురవేణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.) 2006 నుంచి 2011 వరకు ధారూరు మండల జడ్పీటీసీ(టీడీపీ)గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో కొంతకాలంపాటు పని చేశారు. 


అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో వికారాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 వరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019లో టిక్కెట్‌ రాకపోవడంతో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలో చేరి.. అనంతరం ఆర్నెళ్ల తర్వాత తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సంజీవరావుకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సంజీవరావు భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం 10 గంటలకు వికారాబాద్‌లోని మెథడిస్టు చర్చిలో సందర్శనార్థం ఉంచి, మధ్యాహ్నం 2 గంటలకు స్వగ్రామం గేటువనంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 


సీఎం కేసీఆర్‌ సంతాపం..

సంజీవరావు మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. భౌతిక కాయాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల, వికారాబాద్‌ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్‌ తదితరులు సందర్శించి సంతాపం తెలిపారు. 


జడ్పీ చైర్‌పర్సన్‌  సంతాపం

వికారాబాద్‌ రూరల్‌ : వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు అకస్మికంగా మృతి చెందడంతో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి మంగళవారం సంతాపం తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలో మాజీ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి భౌతిక కాయన్ని పరిశీలించారు. భార్య మధురవేణి, కుటుంబ సభ్యులను ఓదార్చి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ  ఎమ్మెల్యే సంజీవరావు మృతి పట్ల వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  కొండల్‌రెడ్డి, ఎంపీపీ చంద్రకళ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంజీవరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో  వికారాబాద్‌ అభివృద్ధికి కృషి చేశారన్నారు. 


మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు నివాళులు

మోమిన్‌పేట :  మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం, ప్రైవేట్‌ కార్యాలయం దగ్గర వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యె సంజీవరావు  చిత్రపటానికి మంగళవారం పూలమాల వేసి సంతపం, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపివో శాంత, సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ అధికారులు మల్లికార్జున్‌, వెంకటయ్య, లక్ష్మీకాంత్‌, వెంకట్‌, నాయకులు వెంకట్‌, అజీజ్‌, అనంతయ్య, ప్రతాప్‌ రెడ్డి, అంజయ్య, ఆనందం, నర్సింహులు, మొగులయ్య, శోభన్‌, ధన్ను తదితరులు ఉన్నారు. 


logo