మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 24, 2020 , 23:49:25

పట్టణ ప్రగతి షురూ..

పట్టణ ప్రగతి షురూ..
  • అన్ని ప్రణాళిక పనులు ప్రారంభం
  • తొలి రోజు సమావేశాలు, వార్డుల్లో పర్యటన
  • సమస్యలను తెలుసుకున్నఎమ్మెల్యేలు, అధికారులు
  • నేడు విద్యుత్‌ గుర్తింపు
  • మార్చి 4వరకు కొనసాగనున్న కార్యక్రమం

మున్సిపాలిటీలను  పరిశుభ్ర  మార్చేందుకు సీఎం కేసీఆర్‌ రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం షురూ అయింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశాలు నిర్వహించి జూపణాళిక లక్ష్యం గురించి ప్రజలకు వివరించారు.  వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కలెక్టర్‌ పౌసుమి బసు కార్యక్రమాన్ని ప్రారంభించి కాలనీలను పరిశీలించారు. తాండూరులో ఎమ్మెల్యే పైలట్‌  ఎమ్మెల్సీ  మహేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య.. పరిగిలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌.. కొడంగల్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఆర్డీఓ వేణుమాధవ్‌ పాల్గొన్నారు. తొలిరోజు కొన్నిచోట్ల పారిశుద్ధ్య పనులు చేపట్టగా.. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.  4వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా.. నేడు విద్యుత్‌ సమస్యలను పరిష్కరించనున్నారు.

- వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పట్టణాల్లోనూ పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరియడమేకాకుండా ప్రగతి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పది రోజులపాటు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొదటి రోజు ఆయా మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి సమస్యలను తెలుసుకోవడంతోపాటు చెత్త, చెదారాన్ని తొలగించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రారంభించారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలోని సుభాశ్‌నగర్‌, సాకేత్‌నగర్‌, గరీబ్‌నగర్‌ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ ప్రారంభించారు. అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలోని 2, 3వ వార్డుల్లో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, కొడంగల్‌ మున్సిపాలిటీలోని 1,2,7 వార్డుల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. పరిగి మున్సిపాలిటీలో సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పట్టణ ప్రగతిలో భాగంగా రెండో వార్డులో ఆదివారం పట్టణ నిద్ర చేయడంతోపాటు సోమవారం 2, 3 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


అదేవిధంగా వికారాబాద్‌ మున్సిపాలిటీలో కలెక్టర్‌ పౌసుమి బసు, తాండూరు మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, పరిగి మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, కొడంగల్‌ మున్సిపాలిటీలో తాండూరు ఆర్డీవో వేణుమాధవ్‌ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అదేవిధంగా మురుగు కాల్వలను పరిశుభ్రం చేయడం, రోడ్డు పక్కనగల చెట్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు, వార్డుల్లో వంగిన స్తంభాలు, ఇండ్లపై వేలాడుతున్న వైర్లను తొలగించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అయితే తొలిరోజు ఆయా వార్డుల్లో పర్యటించి స్థానికంగా గుర్తించిన సమస్యలను నేడు పరిష్కరించడంతోపాటు ఆయా మున్సిపాలిటీల్లోని వార్డుల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను గుర్తించనున్నారు. మార్చి 4 వరకు కొనసాగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికిగాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకుగాను రూ.1.56 కోట్ల నిధులను విడుదల చేసింది.


logo