మంగళవారం 07 జూలై 2020
Vikarabad - Feb 23, 2020 , 23:59:38

పట్టణాభివృద్ధే లక్ష్యంగా..

పట్టణాభివృద్ధే లక్ష్యంగా..
  • నేటి నుంచి పట్టణ ప్రగతి
  • మార్చి 4 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
  • ప్రజల భాగస్వామ్యంతో సుందర పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు
  • పారిశుధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యత
  • 97 వార్డు కమిటీలలో 5,820 మంది సభ్యులు
  • పట్టణ ప్రగతికి రూ.కోటి 56లక్షలు మంజూరు

పరిగి, నమస్తే తెలంగాణ : గ్రామాల స్వరూపం మార్చిన పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చూడుతుంది. 24వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమై మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం మున్సిపాలిటీలలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మార్చడం ద్వారా ప్రజల జీవన విధానంలోను మార్పు తీసుకురావడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని చెప్పవచ్చు. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడంతోపాటు అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయడం ద్వారా విజయవంతం చేసేందుకు ప్రతి మున్సిపాలిటీలో నాలుగు కమిటీలు, ప్రతి వార్డులో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి మున్సిపల్‌ స్థాయిలో ప్రత్యేకంగా 4  కమిటీల ఏర్పాటుతోపాటు, వార్డు స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీల పరిధిలో 10 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని వికారాబాద్‌ మున్సిపాలిటీలో 34 వార్డులలో 80వేల పైచిలుకు జనాభా, తాండూరులో 36 వార్డుల పరిధిలో 85వేల పైచిలుకు జనాభా, పరిగిలో 15 వార్డులలో 25వేల జనాభా, కొడంగల్‌లో 12 వార్డులలో 14,294 మంది జనాభా ఉన్నారు. ప్రతి వార్డు పరిధిలోను పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదట సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి మున్సిపల్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకువెళ్లడం, అన్ని సమస్యలు పరిష్కరింపబడేలా చూసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. 


కమిటీలే కీలకం...

పట్టణ ప్రగతి కార్యక్రమంలోను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్న కమిటీలు కీలకంగా మారనున్నాయి. వార్డు స్థాయిలో నాలుగు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. 1. మహిళలు, 2. యువత, 3. పుర ప్రముఖులు, 4. సీనియర్‌ సిటిజన్లతో ఈ కమిటీల ఏర్పాటు జరిగింది. ప్రతి కమిటీలో 15 మంది సభ్యులు చొప్పున 60 మంది ఉంటారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 97 వార్డులకుగాను మొత్తం 5,820 మంది వార్డు స్థాయి కమిటీలలో సభ్యులుగా నియమించడం జరుగుతుంది. పట్టణ ప్రగతికి సంబంధించి వార్డు స్థాయిలో ఏర్పాటుచేసే కమిటీలో వార్డు కౌన్సిలర్‌, వార్డు ప్రత్యేకాధికారి, వార్డు స్థాయిలో ఏర్పాటుచేసిన ఒక్కో కమిటీ నుంచి ఇరువురు చొప్పున 8 మంది, ఒక శానిటేషన్‌ ఉద్యోగి, ఒక ఎలక్ట్రిషియన్‌, ఒకరు నీటి సరఫరా ఉద్యోగి, ఒకరు టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగి, ఒకరు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఉద్యోగి, ఒకరు మెప్మా ఉద్యోగి, ఒకరు రెవెన్యూ ఉద్యోగి సభ్యులుగా ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వార్డుల వారీగా ఉన్నటువంటి కమిటీలు సమావేశమై ఆయా వార్డులలోని సమస్యలను మున్సిపల్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ కమిటీల సూచనలు, సమస్యలను మున్సిపల్‌ కౌన్సిల్‌ పరిగణనలోకి తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. దీంతో   మున్సిపాలిటీలలో   ఏర్పాటు 


చేస్తున్న ఈ కమిటీలు పట్టణ ప్రగతిలో కీలకంగా మారనున్నాయి. ఈ కమిటీల ఏర్పాటు ద్వారా ఆయా పట్టణాలు, వార్డుల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. మరోవైపు గ్రామపంచాయతీలకు వలె మున్సిపాలిటీలకు సైతం ప్రభుత్వం ప్రతి నెలవారీగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయనుంది. తద్వారా పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేసే నిధుల నుంచి ఖర్చు చేయవచ్చు. 


సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు చక్కటి అవకాశం

పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పట్టణ ప్రగతి కార్యక్రమం ఒక చక్కటి అవకాశం. ప్రభుత్వం గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు పచ్చదనం, పారిశుధ్యానికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా పట్టణాల స్వరూపం మారబోతుంది. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలలో పాలుపంచుకునేలా తచేయడం ద్వారా అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ల ఆలోచనాధోరణికి అనుగుణంగా పరిగిని మరింత సుందర పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం.  

- ముకుంద అశోక్‌ (చైర్మన్‌, పరిగి మున్సిపాలిటీ) 


పాల్గొననున్న జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొదటిరోజు జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. వికారాబాద్‌లో కలెక్టర్‌ పౌసుమిబసు, పరిగిలో అడిషనల్‌ కలెక్టర్‌ మోతీలాల్‌, తాండూరులో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, కొడంగల్‌లో తాండూరు ఆర్‌డీవో వేణుమాధవ్‌లు పాల్గొనడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. 


పట్టణ ప్రగతికి నిధులు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈనెల 24వ తేదీ సోమవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ప్రభుత్వం రూ.కోటి 56లక్షలు మంజూరు చేసింది. వికారాబాద్‌ మున్సిపాలిటీకి రూ.62.27లక్షలు, తాండూరు మున్సిపాలిటీకి రూ.59.10లక్షలు, పరిగి మున్సిపాలిటీకి రూ.18.13లక్షలు, కొడంగల్‌ మున్సిపాలిటీకి రూ.17.22లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.  ఈ నిధులను పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనుల కోసం వినియోగించడం జరుగుతుంది. 


రోజువారీగా చేపట్టే పనులు

*24న సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలోను సమస్యాత్మక చెత్త ప్రాంతం, ఖాళీ ప్రదేశాలు, మురికి నిలువ ప్రదేశం గుర్తింపు, మురికి కాల్వల శుభ్రత చేపట్టాలి.

*25వ తేదీన వేలాడే కరెంటు తీగలు, వంగిపోయిన విద్యుత్‌ స్తంభాల గుర్తింపు, మొదటి రోజు కాలువల నుంచి తీసిన చెత్త తరలింపు, మిగిలిపోయిన ప్రదేశంలో మురికికాల్వల శుభ్రత చేపట్టాలి.

*26న రోడ్లపై గుంతలు గుర్తించడం, పాడైపోయిన, వెలగని విద్యుత్‌దీపాల గుర్తింపు, శిథిలమైన మురికికాల్వల గుర్తింపు, కలుపు మొక్కల పొదల గుర్తింపు, వీధులు శుభ్రపరచడం చేయాలి.

*27న పాడుబడిన బావుల గుర్తింపు, మురికికాలువలకు అనుసంధానం చేసిన మరుగుదొడ్లు, ముళ్లపొదల తొలగింపు చేపట్టాలి.

*28న డంపింగ్‌యార్డు, బహిరంగ మరుగుదొడ్ల గుర్తింపు, మార్కెట్‌, ఆటో స్టాండ్‌, బస్సు స్టాండ్‌, వీధి వ్యాపారుల ప్రదేశం గుర్తింపు, వైకుంఠధామం గుర్తింపు చేపట్టాలి. రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. 

*29న ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల గుర్తింపు, విద్యుత్‌ తీగలు సరిచేయడం, విద్యుత్‌ స్తంభాలు మార్చడం. 

*మార్చి ఒకటిన శిథిలావస్థలో ఉన్న ఇండ్ల గుర్తింపు 

*2న నర్సరీ, పచ్చదన ప్రణాళిక, పాడైపోయిన, వెలగని విద్యుత్‌ దీపాల మరమ్మతు, రోడ్లపై గుంతలు పూడ్చివేత 

*3న ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన, ప్లాస్టిక్‌ సేకరణ 

*4న తడి, పొడి చెత్తపై అవగాహన, సేకరణ కార్యక్రమం


logo