మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Feb 23, 2020 , 23:55:37

ప్రణాళికతో చదివితే విజయం తథ్యం

ప్రణాళికతో చదివితే విజయం తథ్యం
  • ఆందోళన చెందొద్దు.. ఒత్తిడిని జయించాలి
  • జిల్లాలో ‘పది’ పరీక్షలు రాయనున్న 13,378 మంది విద్యార్థులు

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే విద్యార్థుల్లో ఆందోళన, భయం పెరుగుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ ర్యాంకు సంపాదించిన వారే మెరుగైన ఉన్నత విద్యావకాశాలను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. ప్రణాళిక బద్ధంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని విద్యారంగం నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 


పాటించాల్సిన అంశాలు...

*రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. శరీరానికి సరైన నిద్ర ఉంటే ఉదయం ఉత్సాహంగా ఉండే వీలుంటుంది. వీలైనంత త్వరగా పడుకుని ఉదయం 4 నుంచి 7 గంటల మధ్య ఉండే ప్రశాంత సమయంలో చదువును కొనసాగించాలి. ఆ సమయంలో మెదడు చురుకుగా పనిచేస్తుంది. చదివింది జ్ఞాపకం ఉండిపోతుంది.

*ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 15 నిమిషాలు ప్రాణాయామం, ధ్యానం అలవాటు చేసుకుంటే శరీరంతోపాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది.

*పరీక్షలు పూర్తయ్యే వరకు టీవీ, సినిమాలు, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండటం మంచిది.

*చదువుకునే సందర్భంలో కడుపునిండా భోజనం చేయకూడదు. కొంతవరకు వెలితిగానే తీసుకుంటే మంచిది.


స్ఫూర్తినిస్తున్న ప్రత్యేక తరగతులు..

జిల్లా పరిధిలో మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలు 210గాను 8,856 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 66 పాఠశాలలకు గాను 4,522మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గత నవంబర్‌ నెల నుంచి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక గంట ప్రత్యేక సమయాన్ని కేటాయించి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపకరించే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో పూర్తయిన సిలబస్‌కు సంబంధించి వెనువెంటనే స్లిప్‌టెస్ట్‌లు పెడుతూ ఫైనల్‌ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. 


మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం

జిల్లాలో పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం. ఈ ఏడాది 13,378మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 8,856మంది ప్రభుత్వ పాఠశాలల వారు కాగా, 4,522మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది డిసెంబరు 15 నాటికి సిలబస్‌ పూర్తిచేసి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వీరికి సాయంత్రం పూట స్నాక్స్‌ అందజేస్తున్నాం. పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. వెనుకబడిన విద్యార్థులను ఏ, బీ, సీ వర్గాలుగా విభజించి వారికి ఏ ఏ సబ్టెక్టులలో బోధించాలో సూచించాం. -డీఈవో రేణుకాదేవి


 ఆత్మవిశ్వాసమే గెలుపునకు తొలిమెట్టు

పరీక్షల గురించి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. నేను పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను ఎదుర్కొంటాననే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే పాఠాలు అంతబాగా గుర్తుంటాయి. ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు. 

-గోపీనాథ్‌, ఉపాధ్యాయులు, కొడంగల్‌


logo