బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Feb 22, 2020 , 02:46:16

నేడు డీసీసీబీ, డీసీఎంఎస్‌ నోటీస్‌ విడుదల

నేడు డీసీసీబీ, డీసీఎంఎస్‌ నోటీస్‌ విడుదల

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు సంబంధించి నేడు రాష్ట్ర సహకార ఎన్నికల ఆథారిటీ నోటీస్‌ను విడుదల చేయనుంది. అయితే సంబంధిత ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఒకేరోజు నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 25న నామినేషన్లను స్వీకరించడంతోపాటు అదే రోజు నామినేషన్లను పరిశీలన ప్రక్రియతోపాటు నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఈనెల 25తోనే ముగియనుంది. ఈనెల 25న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లను స్వీకరించి, అదేరోజు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తారు.నంతరం నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గడువివ్వనున్నారు. అదేవిధంగా ఈనెల 28న ఉదయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.  29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగునుంది. తదనంతరం ఓట్లను లెక్కించి ఎన్నికైన డైరెక్టర్ల వివరాలను ప్రకటించనున్నారు. అదేవిధంగా డైరెక్టర్ల ఎన్నికకు రిజర్వేషన్లను కూడా రాష్ట్ర సహకార ఎన్నికల ఆథారిటీ ప్రకటించింది. డీసీసీబీలో మొత్తం 20 మంది డైరెక్టర్లు ఉంటారు, వీరిలో 16 మంది ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లే డీసీసీబీ డైరెక్టర్ల్లుగా ఎన్నికవుతారు. అయితే డీసీసీబీలో ఏ క్లాస్‌ సొసైటీ డైరెక్టర్‌ స్థానాలు 16 ఉండగా, బీ క్లాస్‌ సొసైటీ స్థానాలు నాలుగు ఉన్నాయి. ఏ క్లాస్‌ సొసైటీలోని 16 డైరెక్టర్‌ స్థానాలకు ఎస్సీలకు మూడు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు రెండు, 10 స్థానాల్లో జనరల్‌ కేటగిరికి రిజర్వేషన్‌ ఖరారు చేశారు. మరో నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులుగా ఉంటారు, వీరిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ కల్పించనున్నారు. బీ క్లాస్‌ సొసైటీలోని నాలుగు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌కు ఒక్కొ స్థానాన్ని రిజర్వ్‌ చేశారు. మత్స సహకార సంఘాలు, కార్మిక, గొర్ల కాపర్లు తదితర సహకార సంఘాల చైర్మన్లు బీ క్లాస్‌ సొసైటీ డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఎన్నికైన మొత్తం 20 మంది డైరెక్టర్లు కలిసి డీసీసీబీ చైర్మెన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అయితే హైదరాబాద్‌ కేంద్ర  సహకార బ్యాంకు పరిధిలో 57 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా వీటిలో 49 సహకార సంఘాలపై టీఆర్‌ఎస్‌ గెలుపొందింది.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధికి సంబంధించి వికారాబాద్‌ జిల్లాలో 20 పీఏసీఎస్‌లు, రంగారెడ్డి జిల్లాలో 28 పీఏసీఎస్‌లు, మేడ్చల్‌ జిల్లాలో 9 పీఏసీఎస్‌లున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో 20 పీఏసీఎస్‌లు ఉండగా వీటిలో 19 పీఏసీఎస్‌ల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా ఒక పీఏసీఎస్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 28 పీఏసీఎస్‌లుండగా 21 పీఏసీఎస్‌ల్లో టీఆర్‌ఎస్‌, 6 పీఏసీఎస్‌ల్లో కాంగ్రెస్‌, ఒక పీఏసీఎస్‌లో స్వతంత్ర ప్యానెల్‌ గెలుపొందింది. అయితే మెజార్టీ సొసైటీలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌కే డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు), డీసీఎంఎస్‌ (జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) చైర్మన్‌ పదవులు దక్కనున్నాయి. 

జిల్లాకు రెండు డీసీసీబీలు.. 

  జిల్లాకు రెండు డీసీసీబీ చైర్మన్‌ పదవులు దక్కనున్నాయి. హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ పదవులు జిల్లాకు చెందిన వారికే దక్కనున్నట్లు వినిపిస్తుంది. హైదరాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవి కోసం జిల్లా నుంచి ముగ్గురు ఆశావాహులు పోటీ పడుతుండగా, రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కరు పోటీ పడుతున్నారు. వీరిలో కుల్కచర్ల పీఏసీఎస్‌ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన బుయ్యని మనోహర్‌ రెడ్డి, వట్టిమీనపల్లి పీఏసీఎస్‌ నుంచి ఎన్నికైన పోలీస్‌ రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, పెంటారెడ్డిల మధ్యే పోటీ నెలకొంది. అయితే టీఆర్‌ఎస్‌  అధిష్టానంతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలంతా మనోహర్‌రెడ్డినే డీసీసీబీ చైర్మెన్‌గా ఎన్నుకునేందుకు మార్గం సుగుమం అయినట్లు తెలిసింది. మరోవైపు మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవి కూడా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేశారని సమాచారం. కొడంగల్‌ నియోజకవర్గంలోని హస్నాబాద్‌ సొసైటీ నుంచి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డివైపే మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌  అధిష్టానంతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలంతా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.


logo