సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 22, 2020 , 02:42:53

శరవేగంగా జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణ పనులు

 శరవేగంగా జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణ పనులు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ మరో నెలరోజుల్లోగా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పూర్తికాగా జిల్లాలో మట్టి సమస్యతో కొంతమేర పనులు ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం పార్టీ కార్యాలయ నిర్మాణ పనులతోపాటు సమావేశ మందిర నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణంతోపాటు వాచ్‌మెన్‌ గది, వంట గదుల నిర్మాణం కొనసాగుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. రోజుకు 50 మంది కూలీలతో జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు. అయితే జూన్‌ 24 పార్టీ కార్యాలయ నిర్మాణానికి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌ రెడ్డి భూమిపూజ చేశారు. జూలై రెండో వారంలో పార్టీ అధిష్టానం నిర్మాణానికిగాను రూ.60 లక్షల చెక్కును అందజేసింది. అయితే వికారాబాద్‌ పట్టణంలోని సర్వే నెంబర్‌ 290లోని ఒక ఎకరా స్థలాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికిగాను ప్రభుత్వం కేటాయించగా,  పార్టీ అధినేత, సీఎం  కేసీఆర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణానికిగాను రూ.60 లక్షల చెక్కును ఇప్పటికే అందజేయడంతోపాటు నిర్మాణ బాధ్యతలను ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. 

తుదిదశకు చేరిన నిర్మాణ పనులు...

జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయంతోపాటు సమావేశ మందిరం నిర్మాణ పనులు కూడా చిన్న చిన్న పనులు మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయి. పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని 50 మంది కూలీలతోపాటు అనుభవజ్ఞులైన మేస్త్రీలతో పనులు వేగంగా పూర్తి చేశారు. అయితే పార్టీ కార్యాలయంతోపాటు సమావేశ మందిరంలో శ్లాబ్‌లు పూర్తి కావడంతో విద్యుత్‌ పనులు తదితర పనులున్ని పూర్తికాగా, టైల్స్‌ వేయడం, పార్టీ కార్యాలయ భవనానికి కొంతమేర పెయింటింగ్‌ వేయడం మాత్రమే పెండింగ్‌లో ఉంది. అయితే ప్రస్తుతం పార్టీ భవన్‌ చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణంతోపాటు కిచెన్‌ షెడ్‌, వాచ్‌మెన్‌ గదుల నిర్మాణం కొనసాగుతుంది. అంతేకాకుండా పార్టీ కార్యాలయ ఆవరణలో మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను కూడా నిర్మించారు. చిన్న చిన్న పనులే మిగిలిపోయిన దృష్ట్యా నెలరోజుల్లోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే వికారాబాద్‌ పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఉద్యానవన శాఖకు సంబంధించిన స్థలంలో మట్టి కుంగిపోయే స్వభావం ఉండడంతోపాటు నీరు రావడం, నల్లరేగడి నేల కావడంతో బురదమయంతో పనులు నిర్వహించేందుకు ప్రారంభంలో నెలరోజులపాటు కొంత జాప్యం జరిగింది. మోకాళ్ల లోతు వరకు నీరు ఉండి మొత్తం బురద ఉండడంతో కూలీలు పనులు వేగంగా చేయలేకపోయారు. నిర్మాణ పనులు ఎంత వేగంగా చేయాలనుకున్నప్పటికీ బురద మట్టి సమస్యగా మారడంతో పనులు నెమ్మదిగా  జరగడంతో కొంత ఆలస్యమైనట్లు సంబంధిత గుత్తేదారు తెలిపారు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ నెలరోజుల్లోగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంతోపాటు పక్కనే పార్టీ సమావేశాలను నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశ మందిరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం పార్టీ సమావేశాలను వికారాబాద్‌ పట్టణంలోని ఆయా ఫంక్షన్‌ హాళ్లలో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇకపై పార్టీ సమావేశాలను ఫంక్షన్‌ హాళ్లలో నిర్వహించకుండా పార్టీ కార్యాలయం పక్కనే సమావేశ మందిరాన్ని నిర్మించారు. సమావేశ మందిరంలో వెయ్యి మందికిపైగా కూర్చునేలా విశాలంగా నిర్మించారు. ఇప్పటికే సమావేశ మందిర నిర్మాణ పనులు పూర్తికాగా టైల్స్‌ వేయడం మాత్రమే మిగిలి ఉంది. జిల్లా పార్టీ సమావేశాలతోపాటు మండల, పట్టణ సమావేశాలను కూడా సమావేశ మందిరంలోనే నిర్వహించుకోవచ్చు.  

వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం:

   ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి

ఎట్టిపరిస్థితుల్లోనూ వీలైనంతా త్వరితగతిన జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రస్తుతం తుదిదశకు చేరుకోవడం జరిగిందన్నారు. చిన్న, చిన్న పనులే పెండింగ్‌ ఉన్న దృష్ట్యా నెలరోజుల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


logo