బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Feb 22, 2020 , 02:38:08

తట్టు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి

తట్టు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి

బడంగ్‌పేట: చిన్నారులు, విద్యార్థులకు విజృంభిస్తున్న తట్టు వ్యాధి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే టీకాలను ఇప్పించాలని బాలాపూర్‌ ఆరోగ్యకేంద్రం మండల ఆరోగ్య పర్యవేక్షకుడు గోవింద్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వాతావరణంలో మార్పులు, రోగ నిరోధక శక్తి లోపించడం, సరైన సమయంలో సరైన వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించకపోవడం వల్ల పిల్లలకు తట్టు వ్యాధి వ్యాపిస్తుందన్నారు. ప్రమాదకరమైన వ్యాధి కానప్పటికీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ప్రాణ హాని ఉంటుందన్నారు. 9 నెలల నుంచి 14 నెలల వరకు మీజిల్స్‌ రూబెల్లా వాక్సిన్‌ రెండు డోసులు ఇప్పించడంలో నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఐదేండ్ల వరకు ఇప్పించే అవకాశం ఉన్నదన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన సమయంలో సరైన వాక్సిన్‌, సరైన మోతుదులో ఇప్పించాలన్నారు. అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బాలాపూర్‌లో ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల పాటు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్త్రీల వ్యాధి నిపుణులు, చిన్న పిల్లల వైద్య నిపుణులు ఉచితంగా పరీక్షలు చేస్తారన్నారు. శరీరంపైన పొక్కులు, ఎర్రటి చారలు, జ్వరం మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.


logo