గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Feb 21, 2020 , 05:45:29

‘ఉపాధి హామీ’ ప్లాన్‌ రెడీ ..

‘ఉపాధి హామీ’ ప్లాన్‌ రెడీ ..

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఉపాధి హామీ పనులకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం పని దినాలను తగ్గిస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ను రెడీ చేశారు. ఈ ఏడాది 63.88 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, వచ్చే ఏడాది 10 లక్షల మేర పని దినాలను తగ్గిస్తూ నిర్ణయించారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతీ ఒక్క కూలీకి వందరోజులపాటు పని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు వంద రోజుల పని కల్పనలో జిల్లాను టాప్‌-5లో ఉండే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.  ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు 43.62 లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. వంద రోజుల పని కల్పించడంలోనూ జిల్లా ఆరో స్థానంలో నిలిచింది.  ప్రభుత్వం అందించనున్న అదనపు కూలీ ఫిబ్రవరి 1 నుంచి వర్తించనుంది. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.211 అందజేస్తున్నారు. అయితే ఉపాధి హామీ కూలీలకు అందజేసే వేతనాన్ని ఫిబ్రవరిలో 20 శాతం అదనంగా, మార్చిలో 25 శాతం అదనంగా, ఏప్రిల్‌, మే ల్లో 30 శాతం అదనంగా, జూన్‌లో 20 శాతం అదనంగా చెల్లించనున్నారు.  ఉపాధి హామీ కూలీలు ఒకరోజు చేయాల్సిన 100 శాతం పనిలో 80 శాతం చేసిన వంద శాతం కూలీ ప్రభుత్వం చెల్లించనున్న. జిల్లాలో 1,76,963 జాబ్‌కార్డులుండగా,1,67,866 మంది ఉపాధి హామీ కూలీలున్నారు. 


54.49 లక్షల పనిదినాలు టార్గెట్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను 54.59 లక్షల పనిదినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం టార్గెట్‌గా నిర్ణయించింది. ఈ ఏడాది 63.88 లక్షల పనిదినాలను కల్పించాలని టార్గెట్‌గా నిర్ణయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం 10 లక్షల పనిదినాలను తగ్గించడం గమనార్హం. మూడేండ్లలో జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరు అవుతున్న కూలీల సంఖ్య, పనులను బట్టి ప్రభుత్వం జిల్లాలో పని దినాల టార్గెట్‌ను తగ్గిస్తూ నిర్ణయించింది. ముఖ్యంగా రెండేండ్లుగా వంద రోజుల పని పూర్తి చేసుకున్న అనంతరం అదనంగా పని దినాలను కల్పించడంతో పెద్ద సంఖ్యలో కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం  రెండేండ్లుగా  పనిదినాలను పెంచుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం ఉపాధి హామీ పనులకు కూలీలు పెద్దగా హాజరుకాకపోవడంతో పనిదినాలను తగ్గించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాకు సంబంధించి కూలీలందరికీ వంద రోజుల పనిదినాలను కల్పించాలని డీఆర్డీఏ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కూలీ డబ్బులను రూ.205ల నుంచి రూ.211 లకు పెంచిన సంగతి తెలిసిందే. అత్యధికంగా ధారూర్‌ మండలంలో ఉపాధి హామీ కూలీలకు పనిని కల్పించారు. కూలీల వేతనాలకు సంబంధించి రూ.72.09 కోట్లను ఖర్చు చేయగా, మెటీరియల్‌ నిమిత్తం రూ.15.24 కోట్లను గత ఆర్థిక సంవత్సరం వెచ్చించారు.


వందరోజుల పనికల్పనలో ఆరోస్థానం

ఈ ఆర్థిక సంవత్సరం జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పనిని కల్పించడంలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. 7237 కుటుంబాలకు పనిదినాలను కల్పించి జిల్లా ఆరో స్థానంలో ఉండగా, నిజామాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అత్యధికంగా ధారూర్‌ మండలంలో 1174 కుటుంబాలు, వికారాబాద్‌లో 692, మర్పల్లిలో 644 , నవాబుపేట్‌లో 517, మోమిన్‌పేట్‌లో 493, పూడూర్‌లో 441 , బంట్వారంలో 555, నవాబుపేట్‌లో 980 కుటుంబాలకు 100 రోజుల పని దినాలను కల్పించారు.  ఈ ఏడాది  ప్రధానంగా చెరువుల పూడికతీత, భూ అభివృద్ధి పనులు, హరితహారంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటిఊట గుంతల నిర్మాణం పనులను ప్రధానంగా చేపట్టనున్నారు.  అసైన్డ్‌ భూముల్లోని రాళ్లను తీసివేయడం, భూమిని చదునుచేయడం, బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం చేపట్టనున్నారు.  కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాల్వల నిర్మాణం, మైనర్‌ ఇరిగేషన్‌ కాల్వలలో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను చేపట్టనున్నారు. 


logo