సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 21, 2020 , 04:13:59

సేవాలాల్‌ అందరికీ ఆదర్శం

సేవాలాల్‌  అందరికీ ఆదర్శం

వికారాబాద్‌ రూరల్‌ :  సేవాలాల్‌ మహారాజ్‌ లంబాడీలకు మాత్రమే నాయకుడు కాదని, బాబాసాహేబ్‌ అంబేద్కర్‌, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావుల వలే అందరికీ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. బంజారా భవనం కోసం ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని, అట్టి నిధులను బంజారా భవనానికే వినియోగించే విధంగా కృషి చేస్తామన్నారు.  బాల్య వివాహాలను ప్రోత్సహించ రాదని బాగా చదివించి వారిని ఉన్నత స్థాయికి తీసుకు రావాలన్నారు. అడవులు, చెట్లను ప్రేమించే గిరిజనులు వాటిని రక్షించేందుకు కృషి చేయాలని  కలెక్టర్‌ పౌసుమి బసు తెలిపారు. గురువారం  పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో అధికారికంగా సంత్‌సేవాలాల్‌ జయంతిని  ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి జరుపుకున్నారు. గిరిజన యువతీయువకులు, మహిళలు వారి సాంప్రదాయ వస్ర్తాలు ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  


ఈ సందర్భంగా  కలెక్టర్‌  మాట్లాడుతూ..  పిల్లలందరిని చదివించి  అభివృద్ధి చెందాలన్నారు. గిరిజనుల్లో అక్షరాస్యత పెరిగినరోజే తండాలు అభివృద్ధి జరుగుతాయన్నారు. అప్పుడే  సద్గురు సేవాలాల్‌ ఆశయాలను సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాల్లో నర్సరీలను ఏర్పాటు చేసిందని, హరిత హారంలో భాగంగా  మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ఫలాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెనుకబడిన  వర్గాలకు ఎంతో చేయుతనిస్తుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, డీటీడీవో కోఠాజీ, తహసీల్దార్‌ రవీందర్‌, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యులు రాంబాల్‌నాయక్‌, అంబర్‌సింగ్‌, చందర్‌నాయక్‌, రాజునాయక్‌, రాజు, విజయ్‌, రవి, పరశురాం, తదితరులు  పాల్గొన్నారు. 


logo