సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 20, 2020 , 01:29:08

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో గ్రామాల అభివృద్ధి

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో గ్రామాల అభివృద్ధి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ/ పూడూరు : సీఎం కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడని, స్థానిక సంస్థలను బలోపేతం చేస్తేనే అభివృద్ధి సాధ్యమని క్షేత్రస్థాయి నుంచి సమన్వయం చేస్తూ వ్యవస్థనే గ్రామానికి తీసుకువచ్చేలా చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం మన్నెగూడలోని జె.కె ఫంక్షన్‌ హాల్‌లో పంచాయతీ రాజ్‌ ప్రజాప్రతినిధుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కొత్త పంచాయతీ రాజ్‌ చట్టంపై అధికారులు అవగాహన కల్పించారు. 


పంచాయతీ రాజ్‌ సమ్మేళనం దోహదపడుతుంది

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్‌ ప్రజాప్రతినిధుల సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇందులో భాగంగానే పల్లెప్రగతి పేరుతో రెండు విడుతలుగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పల్లెప్రగతిలో గ్రా మాల్లో గుర్తించిన సమస్యలను పూర్తి చేసేందుకు ఈ పంచాయతీ రాజ్‌ ప్రజాప్రతినిధుల సమ్మేళనం ఎంతో దోహదపడనుందన్నారు. గతంలో కరెంటు కష్టాలు, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోయేవారని, సీఎం కేసీఆర్‌ హయాం లో 24గంటల కరెంటు అందుతుందన్నారు. మిషన్‌ భగీరథ జలాలతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయి నుంచి కో-ఆర్డినేట్‌ చేస్తేనే అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన ముఖ్యమంత్రి అందుకోసం అదనపు కలెక్టర్లను సైతం నియమించడం జరిగిందన్నారు. దీంతో వ్యవస్థనే గ్రామాలకు వచ్చేలా చేశారన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా సర్పంచ్‌లే వారి గ్రామాలను బాగు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడని, స్థానిక సంస్థలను బలోపేతం చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ర్టానికి, మున్సిపాలిటీ కేటాయించే విధంగా గ్రామ పంచాయతీలకు కూడా ఎంత బడ్జెట్‌ అవసరమౌతుందో నిర్ణయించుకోవాలని, ఆ బడ్జెట్‌ను గ్రామాభివృద్ధికే పూర్తిగా వాడుకోవాలన్నారు. పరిగి, ధారూరు మండలాల్లో కోతుల సమస్యలతో పంటలు పాడైపోతుండేవని గతంలో చెబితే మేము వాటిని అడవుల్లో వదలాలని చెప్పే వారమని, కాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగా ఆలోచించి వాటి కోసం అడవుల్లో వాటికి కావాల్సిన చెట్లను పెంచాలని ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమాల ను నిర్వహించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ప్లయింగ్‌ స్కాడ్‌లను సైతం ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. 


త్వరలో ప్రజాప్రతినిధులు పల్లె నిద్ర 

త్వరలో ప్రజాప్రతినిధులు పల్లె నిద్ర చేయాలని కేసీఆర్‌ ఆదేశించారని, అప్పుడు ఖచ్చితంగా పర్యటించి గ్రామాల్లో ని ఎస్సీ, ఎస్టీ వాడలను సందర్శించాలని నిర్ణయించారన్నా రు. జిల్లాలోని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసి జిల్లా ను ఆదర్శంగా తీర్చిదిద్ధే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా అదనపు కలెక్టర్ల సహకారం తీసుకుని గ్రామాలను సర్పంచులు అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. 


అభివృద్ధికి సహకరిస్తాం.. 

జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. 100శాతం గ్రామాల్లో పన్ను లు వసూలు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌ లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలన్నారు. అభివృద్ధికి తమవంతు సహయ సహాకారాలు అందిస్తామన్నారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడు తూ పల్లెప్రగతి కార్యక్రమం కొన్ని రోజులకే పరిమితంగా కాకుండా నిరంతరం కొనసాగుతుందని అన్నా రు. ఈ నెల 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమవుతుందని, పల్లెప్రగతిని విజయవంతం అయి పల్లెలని పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. అదే విధంగా పట్టణాలు కూడా పట్టణ ప్రగతితో కొత్త శోభను సంతరించుకుంటాయన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు కానీ ఎవరూ వాడటం లేదని, మరుగుదొడ్లను వాడుకోవాలని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా గ్రామాలను మార్చుకోవాలన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ రెండు విడుతలుగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. సర్పంచ్‌లకు నిధులు త్వరలోనే అందుతాయని, గ్రామ పంచాయతీల్లో 100శాతం పన్నులు కట్టించుకోవాలన్నారు. ఇంకుడుగుంతల ఏర్పాటు లో మనం వెనుకబడి ఉన్నామని, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను హరితహారం నర్సరీల ఏర్పాటుకు కేటాయిస్తుందన్నారు. ఎమ్మెల్యే, అధికారుల సహకారంతో గ్రామ పంచాయతీలలో అభివృద్ధి చేసుకోవాలన్నారు. 


గ్రామాన్ని పరిశ్రుభంగా తీర్చి దిద్దడం సర్పంచ్‌దే బాధ్యత

అనంతరం కలెక్టర్‌ పౌసుమి బసు మాట్లాడుతూ పల్లెప్రగతిలో సర్పంచ్‌ బాధ్యత గ్రామ స్వచ్ఛత పచ్చదనం, పన్ను వసూలు చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమేనన్నారు. గ్రామ సర్పంచులు వారి పంచాయతీ పరిధిలో ఉన్న కుంట లు, చెరువులను సంరక్షించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు 50శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయని, పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేయాలన్నారు. జిల్లాలోని గ్రామాలను మోడల్‌ గ్రామాలుగా తీర్చిదిద్ధి ఇతర జిల్లాల కంటే మనం ఆదర్శంగా నిలువాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి, జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్‌, చంద్రయ్య, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీఎఫ్‌వో వేణుమాదవ్‌, వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. logo