మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 20, 2020 , 01:28:10

మున్సిపాలిటీల పరిశుభ్రతకు పట్టణ ప్రగతి

మున్సిపాలిటీల పరిశుభ్రతకు పట్టణ ప్రగతి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ/ పూడూరు : మున్సిపాలిటీలను పరిశుభ్రంగా ఉంచేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం  మన్నెగూడ సమీపంలోని జేకే ఫంక్షన్‌హాలులో పట్టణ ప్రజా ప్రతినిధుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో పల్లెప్రగతి వలే మున్సిపాలిటీల్లో కూడా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి, వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించేందుకే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహన కోసం  ముఖ్యమంత్రి రూ. 70కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. స్థానిక మున్సిపల్‌ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో పాటు ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. 


10రోజుల పాటు పట్టణ ప్రగతి

ఈ నెల 24నుంచి 10రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించ డం జరుగుతుందన్నారు. కౌన్సిలర్లు నూతనంగా తీసుకొచ్చిన మున్సిపల్‌ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాని పరిధిలో పాలన కొనసాగించాలన్నారు. పట్టణ పరిధిలోని నూతన గృహ నిర్మాణాలు చేపట్టేవారు తప్పనిసరిగా మున్సిపల్‌ నుంచి అనుమతులు పొందాలన్నారు. మున్సిపల్‌ పరిధిలోని భవనాలకు సరిపడు పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, పన్నులు అధికంగా వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. పట్టణ పరిధిలోని బస్టాప్‌, ఇతర ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్న స్థలాలను గుర్తించి మూత్రశాలలను, నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాలకు రూ. 40వేల కోట్లు ఖర్చు చేయగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 70కోట్లు కేటాయించిందన్నారు. ప్రతి కౌన్సిలర్‌, అధికారులు వార్డుల్లో తిరిగి సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వార్డుల్లో మొదటగా మురుగు కాల్వలను శుభ్రం చేయించాలని, పురాతన విద్యుత్‌ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాల ఏర్పాటు చేయించాలన్నారు. 


పట్టణ ప్రగతికి శ్రీకారం

పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెప్రగతి వలే పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మున్సిపాలిటీల చైర్మన్‌, చైర్‌పర్సన్లు ఈ కార్యక్రమం ద్వారా పట్టణ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మున్సిపాలిటీల్లోని ఆయా వార్డుల్లో తీవ్ర సమస్యలను ముందుగా గుర్తించి అధికారులతో కలిసి శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలన్నారు. పట్టణాభివృద్ధికి నిధులు సమకూర్చుకునేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు.  వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలోని నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా మున్సిపల్‌ కౌన్సిలర్లు చూడాలన్నారు. పట్టణ ప్రాంతంలోని లే అవుట్లు, భవన నిర్మాణాలకు  సరైన అనుమతులు పొందకుండా నిర్మాణాలు చేపడితే వారిపై కొత్త యాక్టు ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ విషయాన్ని కౌన్సిలర్లు గుర్తించాలన్నారు. వికారాబాద్‌ పట్టణంలోని ఆయా రోడ్లపై తోపుడు బండ్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పట్టణ ప్రాంతంలోని చిరు వ్యాపారాలన్ని ఒకే చోట ఉండేలా స్థలాన్ని పరిశీలించి కేటాయించాలన్నారు. పట్టణంలోని హోటళ్లను కూడా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తరుచుగా తనిఖీలు చేసి నాణ్యమైన ఆహారం అందించేలా చూడాలన్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లోని  ఇబ్బందులు ఉన్న రోడ్లను, విద్యుత్‌ స్తంభాలను, మురుగు కాల్వలను గుర్తించి ఆయా సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, చైర్మన్‌లు, కౌన్సిలర్లు, అధికారులు చురుకుగా పాల్గొని పట్టణాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పట్టణ ప్రగతి పనులపై నిర్లక్ష్యం వహించకూడదన్నారు. సూచించిన ఆయా తేదీల వారీగా వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 


logo