గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Feb 20, 2020 , 01:13:59

తీరనున్న సొంతింటి కల

తీరనున్న సొంతింటి కల

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : సొంతగూడు లేని నిరుపేదలకు అన్నింటా సౌకర్యాలతో కూడిన ఇంటిని నిర్మించి వారి ఆత్మగౌరవాన్ని పెంచేలా సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకాన్ని రూపొందించి ఇండ్ల నిర్మాణాలు చేపట్టి అందిస్తున్నారు. బుధవారం పట్టణంలోని గాంధీనగర్‌ వీధిలో 150 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలకు గాను ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని, ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే పథకాలను ప్రవేశపట్టి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. నిరుపేదలు ఇండ్లులేక ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని, ఆర్థిక స్థోమత లేక ఇంటి నిర్మించుకోలేక మురికివాడల్లో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితి తెలంగాణలోని పేదవారికి ఉందొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రూ.5.30లక్షలతో డబుల్‌ బెడ్‌ రూమ్‌లను నిర్మించి ఇండ్లులేని నిరుపేదల సొంతింటి కలను తీరుస్తున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇచ్చారన్నారు.  ఇదే తరహాలో కొడంగల్‌ పట్టణంలోని నిరుపేదలకు అందించేందుకు మొత్తం 300 ఇండ్లు మంజూరు చేశారని, గాంధీనగర్‌ వీధిలో 150 ఇంటి నిర్మాణాలు, అదేవిధంగా పట్టణ శివారులోని సిద్దినాంపు ప్రదేశంలో 150 ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.


 కొడంగల్‌కు డబుల్‌ బెడ్‌రూమ్‌లు మంజూరు అయినప్పటికీ ఆయా కారణాల వల్ల ఆలస్యమైందని, టెండర్ల ప్రక్రియలో కాంట్రాక్టర్లు ముందుకు రాక మరికొంత వరకు జాప్యం జరిగిందన్నారు. కాగా, వచ్చే దసరా నాటిని మొత్తం 300 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి నిరుపేదలకు పట్టాలను అందించే లక్ష్యంగా పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్‌ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు గోడల రాంరెడ్డితోపాటు మాజీ సర్పంచ్‌ రమేశ్‌బాబు, టీఆర్‌ఎస్‌ నాయకులు కేవీ రాజేందర్‌, వెంకటయ్య(మాఫి), బాలప్ప  పాల్గొన్నారు. 


logo