మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 18, 2020 , 23:38:32

జిల్లా దవాఖాన సేవలు మరింత మెరుగు పడాలి

జిల్లా దవాఖాన సేవలు మరింత మెరుగు పడాలి
  • - ఎన్‌క్యూఏఎస్‌ ధ్రువీకరణలో తెలంగాణ టాప్‌
  • - రాష్ట్రంలోని 100 ఆస్పత్రులకు గుర్తింపు
  • - రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ నోడల్‌ ఆఫీసర్‌డా. రాంబాబు నాయక్‌
  • - కాయకల్ప కోసం జిల్లా దవాఖాన సందర్శన

తాండూరు టౌన్‌ : నాణ్యత ప్రమాణాలు, రోగులకు సౌకర్యవంతమైన సేవలందించడం పట్ల కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్‌క్యూఏఎస్‌(నేషనల్‌ క్వాలిటీ అసురెన్స్‌ స్టాండర్డ్‌) గుర్తింపు పొందడంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ క్వాలిటీ అసురెన్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ డా.రాంబాబు నాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్‌ ద్వారా చేపట్టిన కాయకల్ప అవార్డు పరిశీలనలో భాగంగా ఆయన తాండూరులోని సర్కారు జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా డా.రాంబాబు నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ సర్కారు ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలు, రోగులకు సౌకర్యవంతమైన సేవలను అందించే ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ఎన్‌క్యూఏఎస్‌ ద్వారా తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) కమిటీలతో సర్వే చేస్తుందని తెలిపారు. దేశంలో 18 వేల ఆసుపత్రుల్లో సర్వే చేయగా 450 ఆసుపత్రులకు ఎన్‌క్యూఏఎస్‌ గుర్తింపు వచ్చిందన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలువగా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 100 ఆసుపత్రులకు ఎన్‌క్యూఏఎస్‌ గుర్తింపు వచ్చిందని, ఆంధ్ర రాష్ట్రంలో 74 ఆసుపత్రులు గుర్తింపు పొందాయని తెలిపారు. ఎన్‌క్యూఏఎస్‌ గుర్తింపు ద్వారా 100 పడకలు ఉన్న ఆసుపత్రికి ఒక్కో బెడ్‌కు రూ. 10 వేల చొప్పున రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు. మూడేళ్ల పాటు అందించే ఆర్థిక సహాయంతో ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.


 అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కాయకల్ప అవార్డు కోసం పోటీ పడుతున్న 1048 ఆసుపత్రులలో 250 ఆసుపత్రులు ఎంపిక అవుతున్నాయన్నారు. కాయకల్ప అవార్డు కోసం ఇంటర్నల్‌, పీర్‌, ఎక్ట్రనల్‌ అసెస్‌మెంట్‌లు జరుగుతాయని తెలిపారు. కాయకల్ప కింద విన్నర్‌, రన్నర్‌ విభాగాల్లో జిల్లా ఆసుపత్రులకు రెండు, కమ్యూనిటీ ఆసుపత్రులకు రెండు, ఏరియా ఆసుపత్రులకు రెండు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు అవార్డులు అందిస్తారని వివరించారు. గెలిచిన ఆసుపత్రికి రూ. 50 లక్షలు, రన్నర్‌గా నిలిచిన ఆసుపత్రి రూ. 25 లక్షలు ప్రోత్సహాం అందుతుందని వెల్లడించారు. కాయకల్ప పోటీలో పాల్గొంటున్న తాండూరులోని సర్కారు జిల్లా ఆసుపత్రిని ఫీర్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా సందర్శించామని తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే ఆసుపత్రిలో సేవలు మెరుగుపడడంతో పాటు ఆసుపత్రి బయటి పరిసరాలు మెరుగుపడాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 


ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.మల్లికార్జున్‌తో కలిసి ఆసుపత్రిలోని క్యాసువాలిటీ, ప్రసూతి విభాగం, ఆపరేషన్‌ థియేటర్‌, రక్తనిధి కేంద్రం, ల్యాబ్‌, డయాలిసిస్‌తో పాటు పలు విభాగాలను ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడి ఆరా తీశారు. ఆయన వెంట క్వాలీటీ అసురెన్స్‌ కన్సల్‌టెంట్‌ అశోక్‌కుమార్‌, ఆసుపత్రి ఆర్‌ఎంవోలు డా.ఆనంద్‌కుమార్‌, డా. యాదయ్య, క్వాలీటీ ఆఫీసర్‌ వంశీకృష్ణ, శ్రీధర్‌గౌడ్‌, వైద్య సిబ్బంది ఉన్నారు. 


logo