శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Feb 18, 2020 , 23:37:08

రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలి

రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలి

ధారూరు : రైతులు ప్రతి ఏటా భూసార పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలి జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ సూచించారు. మంగళవారం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన  ధారూరు మండల పరిధిలోని నాగుసాన్‌పల్లిలో కృత్రిమ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ మాట్లాడారు. రైతులు పంట పొలాల్లో ఉన్న మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వాటి ఫలితాలను తెలుసుకున్న తర్వాతనే పంట సాగు చేసుకోవాలన్నారు. ప్రతి ఏటా పంట మార్పిడి తప్పని సరి చేయాలన్నారు. మట్టి నమూనా పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వేసి పంట సాగు చేసుకోవాలన్నారు. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సలహలు తీసుకోవాలన్నారు. రైతులు రసాయన ఎరువులను వాడొద్దని, సేంద్రియ ఎరువులనే వాడాలన్నారు. సేంద్రియ ఎరువులు వాడడంపై రైతులకు మంచి దిగుబడితో అధిక లాభం వస్తుందన్నారు. రసాయన ఎరువులు వాడటంతో రైతుకు నష్టాలు వస్తాయన్నారు. 


అనంతరం ధారూరు పీఎపీఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులు వాడితే మంచి మంచి లాభలు వస్తాయని, రసాయన ఎరువులు వాడడాన్ని తగ్గించాలన్నారు. గ్రామంలోని రైతులు పండించే పంటలను వ్యవసాయాధికారులకు చెప్పి నమోదు చేయించాలన్నారు. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సూచనలు, సలహలు తప్పని సరి తీసుకోవాలన్నారు. గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు, సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు కలిసి సమన్వయంతో రైతుల పంటల నమోదు చేసుకోవాలన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆధికారులు చర్యతీసుకోవాలన్నారు. గత సంవత్సరం రైతులకు ఎరువుల కొరత ఉండేదని, ఈ ఏడాది లేకుండా చూడాలన్నారు. అనంతరం నాగుసాన్‌పల్లి సర్పంచ్‌ వెంకటయ్య నూతనంగా ఎన్నికైన పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌లను ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి, ధారూరు జడ్పీటీసీ కొస్నం సుజాత, ధారూరు మండల రైతు సమన్వయ కమిటీ మండలాధక్ష్యుడు రాంరెడ్డి, ధారూరు పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజునాయక్‌, ధారూరు మండల వ్యవసాయాధికారి జ్యోతి, ధారూరు టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధక్ష్యుడు .వేణుగోపాల్‌ రెడ్డి, నాగుసాన్‌పల్లి   సర్పంచ్‌  వెంకటయ్య పాల్గొన్నారు.


logo