బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Feb 18, 2020 , 23:34:28

‘పల్లె ప్రగతి’పై షీటీం ఇన్‌చార్జి పరిశీలన

‘పల్లె ప్రగతి’పై షీటీం ఇన్‌చార్జి పరిశీలన

బొంరాస్‌పేట : గ్రామంలో ఎక్కడ చూసినా మురికి నీరే కనిపిస్తుంది, మురుగు కాల్వలు నిర్మించలేదా, ఇలా ఉంటే ప్రజలు రోగాల బారిన పడతారని రాష్ట్ర షీటీం ఇన్‌చార్జ్‌ స్వాతిలక్రా అన్నారు. మండలంలోని తుంకిమెట్ల, బొట్లవానితండా గ్రామాల్లో మంగళవారం పర్యటించిన ఆమె పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించారు. తుంకిమెట్లలో పారిశుధ్య లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ ఏం సమస్యలు ఉన్నాయని అడిగారు. గ్రామంలో ఎక్కడైనా ఓపెన్‌ బోర్లు ఉన్నాయా అని ప్రశ్నించగా లేవని ప్రజలు తెలిపారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాలని, మురికి నీటి వల్ల దోమల బాధ ఎక్కువగా ఉందని మహిళలు తెలిపారు. వీధి దీపాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. చెత్తను వేయడానికి బుట్టలు ఇచ్చారా ఎక్కడ వేస్తున్నారని మహిళలను ప్రశ్నించగా సేకరించిన చెత్తను బట్టల్లో వేసి ఒకచోట నిల్వ చేసి ట్రాక్టర్లలో వేస్తున్నామని మహిళలు తెలిపారు. పల్లె ప్రగతిలో ఎలాంటి పనులు చేశారు, శ్రమదానం చేశారా ఎంతమంది పాల్గొన్నారని సర్పంచ్‌ స్వరూపను ప్రశ్నించారు. ఒక్కో వార్డులో 30 మంది చొప్పున పాల్గొని శ్రమదానం చేసి వీధులను శుభ్రం చేశామని, పిచ్చి మొక్కలను తొలగించామని సర్పంచ్‌ తెలిపారు. కల్యాణి, సుస్మిత అనే చిన్నారులతో మాట్లాడుతూ స్కూల్‌ వెళ్తున్నారా ? ఏ స్కూలుకు వెళ్తున్నారు ? ఎన్నో తరగతి చదువుతున్నారు ? పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారా ? గుడ్డు ఎన్ని రోజులకు ఇస్తున్నార అని స్వాతిలక్రా అడిగారు.


గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నామని, మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు రోజులు గుడ్లు ఇస్తున్నారని చిన్నారులు చెప్పారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్ల మిషన్‌ భగీరథ నీరు ప్రజలందరికీ అందడం లేదని ప్రజలు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వెళ్లి హరితహారంలో మొక్కలు నాటారా అని పరిశీలించారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడం చూసి కొత్తవాటి నిర్మాణం కోసం అంచనాలు తయారు చేసి పంపాలని సర్పంచ్‌కు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం లేదని టీచర్‌ తెలిపారు. పాఠశాల సమీపంలోనే ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని చూసి సిబ్బంది రెగ్యులర్‌గా వస్తున్నారా అని అడిగారు. డంపింగ్‌ యార్డును పరిశీలించారు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీవో పాండు, ఎస్‌ఐ వెంకటశీను ఉన్నారు. 


logo