గురువారం 04 జూన్ 2020
Vikarabad - Feb 18, 2020 , 00:17:25

24వ తేదీ నుంచి పట్టణ ప్రగతి షురూ

24వ తేదీ నుంచి పట్టణ ప్రగతి షురూ

పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. రెండు విడుతల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి.

  • పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణాల్లో పదిరోజుల కార్యక్రమాలు
  • పచ్చదనం, పారిశుధ్యానికి ప్రాధాన్యం
  • మహిళలకు ప్రత్యేక మూత్రశాలల ఏర్పాటుకు చర్యలు
  • 19న మన్నెగూడలో పంచాయతీ సమ్మేళన్‌
  • స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. రెండు విడుతల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి. అయితే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏయే పనులు చేయాలనే దానిపై నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి సన్నాహక సదస్సును నిర్వహించనున్నారు. ఈ సన్నాహక సదస్సుకు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు హాజరుకానున్నారు. అయితే ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పది రోజులపాటు పట్టణాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో పచ్చదనంతోపాటు పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. పది రోజుల్లో పట్టణాలన్నింటిని ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకుగాను పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరిని భాగస్వాములను చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి ప్రత్యామ్నాయాలను వినియోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడంతో వంద శాతం ప్లాస్టిక్‌ నిషేధం చేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు. 


ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి..

ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభంకానుంది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి ఆదర్శ పల్లెలుగా మార్పురాగా, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి పనులు చేపట్టనున్నారు. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేకాధికారిని నియమించనున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా చేయాల్సిన పనులను గుర్తించనున్నారు. ముందుగా వార్డు కమిటీలను నియమించి యువజన, మహిళా, సీనియర్‌ సిటిజన్‌లతో, మేధావులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత వార్డు కమిటీలు ప్రతి 90 రోజులకోసారి సమావేశమై ఆయా పట్టణాలకు ఏం కావాలి, ఏయే పనులు చేయాలనే దానిపై కమిటీ సభ్యులిచ్చే సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా పచ్చదనం, పారిశుధ్య పనులు ప్రధానంగా చేపట్టనున్నారు. మురుగుకాల్వలను శుభ్రం చేయడం, మురికి గుంతలను పూడ్చడం, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటడం, హరిత ప్రణాళిక రూపొందించడం, వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి, నర్సరీలను ఏర్పాటు చేయడం, ఒకవేళ పట్టణాల్లో అనువైన స్థలాలు లేనట్లయితే సమీప గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేయడం, నర్సరీల ఏర్పాటుకుగాను గ్రామాలను ఎంపిక చేయనున్నారు. అంతేకాకుండా ఏ మున్సిపాలిటీల్లో అయితే పారిశుధ్య పనుల కోసం వాహనాలు లేనట్లయితే సంబంధిత మున్సిపాలిటీకి వాహనాలను సమకూర్చడం వంటి ప్రణాళికలను రూపొందించనున్నారు.


వీటితోపాటు మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయడం, ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులను మెరుగుపర్చడం, గుంతలను పూర్తిగా పూడ్చివేయడం వంటి పనులను చేపట్టనున్నారు. పట్టణాల్లో శ్మశానవాటికల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయడం, ముళ్ల పొదలను, తుమ్మ చెట్లను తొలిగించడం, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లను ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయడం, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేయడం, డంపింగ్‌ యార్డులకు స్థలాలను గుర్తించడం, పబ్లిక్‌ టాయిలెట్లతోపాటు మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్లను నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేయనున్నారు. ఆయా మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించనున్నారు. అదేవిధంగా ఆయా మున్సిపాలిటీల్లోని వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే వారిని అక్కడి నుంచి మార్చనున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీల్లో పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించనున్నారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకుగాను ఆధునిక పద్ధతులతో ప్రమాదరహిత విద్యుత్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. వంగిన, తుప్పు పట్టిన రోడ్డు మధ్యలోని స్తంభాలతోపాటు పుట్‌పాత్‌లపై గల స్తంభాలను తొలిగించనున్నారు. అంతేకాకుండా వేలాడే వైర్లను సరిచేయనున్నారు. 


logo