గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Feb 18, 2020 , 00:16:19

త్వరలో జిల్లాలో ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రం

త్వరలో జిల్లాలో ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రం

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీస్‌ అవసరం ఎంతైనా ఉందని, ఇప్పటికే డీఎస్పీ నేతృత్వంలో ఎనిమిది మంది పోలీస్‌ సిబ్బంది ట్రాఫిక్‌ బాధ్యతను చూసుకుంటున్నారని, అదనంగా మరో 10 మంది ట్రాఫిక్‌ సిబ్బందిని కేటాయిస్తామని ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

  • ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కూడా అవసరమే
  • అదనంగా మరో 10మంది సిబ్బంది
  • ఫైరింగ్‌ రేంజ్‌కు అనుకూల స్థలం ఉంటే ఇక్కడే ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు
  • జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటిన ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌  పోలీస్‌ అవసరం ఎంతైనా ఉందని, ఇప్పటికే డీఎస్పీ నేతృత్వంలో ఎనిమిది మంది పోలీస్‌ సిబ్బంది ట్రాఫిక్‌ బాధ్యతను చూసుకుంటున్నారని, అదనంగా మరో 10 మంది ట్రాఫిక్‌ సిబ్బందిని కేటాయిస్తామని ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. సోమవారం పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్‌లోని జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విలేకరులు ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు, ట్రాఫిక్‌ తదితర అంశాలపై ప్రశ్నించగా ఐజీ స్పందిస్తూ ఫైరింగ్‌ రేంజ్‌కు సంబంధించి ప్రతిపాదనలు అందాయని, ఇంతకు ముందు జిల్లా నుంచి సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ వెళ్లి ఫైరింగ్‌లో శిక్షణ పొందేవారన్నారు. ఇక్కడ దానికి అనుకూలంగా స్థలం లభిస్తే ఏర్పాటు చేస్తామని, అందుకోసం ఏమైనా స్థలాలు ఉంటే గుర్తించాలని ఎస్పీ నారాయణకు సూచించారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌  దృష్ట్యా ఇక్కడ ట్రాఫిక్‌ సిగ్నల్‌, రోడ్లపై మార్కింగ్‌లు అవసరమన్నారు. ట్రాఫిక్‌  కోసం ఎంత మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీని ప్రశ్నించగా, ఎనిమిది మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలుపగా, మరో 10 మందిని కేటాయించాలని ఐజీ సూచించారు. 


అదే విధంగా జిల్లాల వారీగా టీటీఐ (ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌)ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందు కోసం రెండు ఎకరాల స్థలం అవసరం ఉంటుందన్నారు. స్థలాలు గుర్తించిన తరువాత కేంద్రాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. డీఐజీ శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.  జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, జిల్లాలో 4 వేల మొక్కలు నాటేందుకు నిర్ణయించామని తెలిపారు.  అందులో భాగంగా జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటితే ఇక్కడ శిక్షణకు వచ్చిన అభ్యర్థులు తొమ్మిది నెలల శిక్షణ కాలంలో మొక్కలను సంరక్షించుకుంటారన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ, ఏఎస్పీ రషీద్‌, డీఎస్పీ సంజీవరావు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.  


logo