శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Feb 17, 2020 , 00:23:06

సహకార పీఠాలపై గులాబీ జెండా

సహకార పీఠాలపై గులాబీ జెండా

జిల్లాలోని సహకార పీఠాలపై గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 సొసైటీల్లో ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహించగా 18చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ఒకచోట కాంగ్రెస్‌ అభ్యర్థులు పదవులను దక్కించుకున్నారు. 16చోట్ల ఏకగ్రీవం కాగా, ఎల్మకన్నె, కొత్తగడి, పూడూరు సంఘాల్లో ఎన్నిక జరిగింది.

  • 21 సొసైటీల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ కైవసం
  • 16చోట్ల ఏకగ్రీవం.. 3 సొసైటీల్లో ఎన్నిక
  • మరో మూడు సంఘాల్లో ఎన్నిక నేటికి వాయిదా
  • పూడూరులో ఉనికిని చాటుకున్న కాంగ్రెస్‌
  • నేడు డీసీసీబీ, డీసీఎంఎస్‌ నోటిఫికేషన్‌
  • జిల్లాను వరించనున్న డీసీసీబీ చైర్మన్‌ పదవి?!

జిల్లాలోని సహకార పీఠాలపై గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 సొసైటీల్లో ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహించగా 18చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ఒకచోట కాంగ్రెస్‌ అభ్యర్థులు పదవులను దక్కించుకున్నారు. 16చోట్ల ఏకగ్రీవం కాగా, ఎల్మకన్నె, కొత్తగడి, పూడూరు సంఘాల్లో ఎన్నిక జరిగింది. ఒక్క పూడూరు సొసైటీలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని చాటుకున్నది. ఎక్‌మామిడి, దౌల్తాబాద్‌, మెట్లకుంట సొసైటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక నేటికి వాయిదా పడింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ నేడు విడుదల కానుండగా, డీసీసీబీ చైర్మన్‌ పదవి ఈసారి జిల్లాకే దక్కనున్నట్టు సమాచారం.  

-పరిగి, నమస్తే తెలంగాణ


పరిగి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జోరు అప్రతిహతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఒక్క పూడూరు సొసైటీలో మినహా మిగతా 21 సొసైటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలైనప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం పనిచేశాయి. ఎప్పటిలాగానే ఈ ఎన్నికల్లో సైతం ప్రజలు టీఆర్‌ఎస్‌కు వెన్నంటి నిలిచి సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచారు. రైతాంగా సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన నేపథ్యంలో రైతులు సైతం తమకు బాసటగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి మరోసారి మద్దతు ప్రకటించి టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపించగా సొసైటీ చైర్మన్లుగా టీఆర్‌ఎస్‌ వారు గెలుపొందారు. జిల్లాలో 22 సొసైటీలు ఉండగా ఒక్క పూడూరు మినహా 21 సొసైటీలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఆదివారం అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించగా మూడు పీఏసీఎస్‌ల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగతా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. తద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పటిలాగే ఈ ఎన్నికలోనూ విజయ పరంపరను కొనసాగించింది. 


సొసైటీల నూతన చైర్మన్లు...

జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 22 సొసైటీలకుగాను ఆదివారం 21 సొసైటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో 16 సొసైటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మూడు సొసైటీల్లోనే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా సొసైటీ చైర్మన్లుగా ఎన్నికైన వారిలో ఎం.ముత్యంరెడ్డి (శివారెడ్డిపేట్‌), పి.రాంరెడ్డి (వట్టిమీనపల్లి), వై.సత్యనారాయణరెడి ్డ(ధారూరు), పి.వెంకట్‌రెడ్డి (హరిదాస్‌పల్లి), బి.విష్ణువర్ధన్‌రెడ్డి (మోమిన్‌పేట), పి.అంజిరెడ్డి (మేకవనంపల్లి), ఎస్‌.ప్రవీణ్‌రెడ్డి (పెద్ద మర్పల్లి), పి.రాంచంద్రారెడ్డి (బంట్వారం), పి.లక్ష్మారెడ్డి (తట్టే పల్లి), డి.విష్ణువర్ధన్‌రెడ్డి(పెద్దేముల్‌), సురేందర్‌రెడ్డి (యాలాల), ఎ.వెంకట్‌రాంరెడ్డి (నవాంద్గి), గురునాథ్‌రెడ్డి (హస్నాబాద్‌), బి.మనోహర్‌రెడ్డి (కులకచర్ల), డి.ప్రభాకర్‌రెడ్డి (మోత్కూర్‌), కె.శ్యాంసుందర్‌రెడ్డి (పరిగి)లు ఎన్నికయ్యారు. ఎం.సుభాన్‌రెడ్డి (కొత్తగడి), ఎస్‌.రవీందర్‌గౌడ్‌ (ఎల్మకన్యె), పి.సతీశ్‌రెడ్డి (పూడూరు)లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో సొసైటీ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఇదిలావుండగా జిల్లా పరిధిలోని ఎక్‌మామిడి, దౌల్తాబాద్‌, మెట్లకుంట సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ఆదివారం వాయిదా పడగా, 17న నిర్వహించనున్నారు. ఇదిలావుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే 4 సొసైటీలు ఏకగ్రీవమవగా, 3 సొసైటీల్లో 13 డైరెక్టర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ సాధించింది. 


జిల్లాకు దక్కనున్న డీసీసీబీ చైర్మన్‌...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డీసీసీబీ చైర్మన్‌ పదవీ ఈసారి జిల్లాకు దక్కనుంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈ నెల 17న విడుదల చేయనున్నారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతున్నది. ఇదిలావుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో డీసీసీబీ చైర్మన్‌ పదవీ ఈసారి వికారాబాద్‌ జిల్లాకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మంత్రి, ఎమ్మెల్యేలందరూ జిల్లాకు డీసీసీబీ చైర్మన్‌ పదవీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాలోని కులకచర్ల పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికైన బి.మనోహర్‌రెడ్డికి డీసీసీబీ చైర్మన్‌ పదవీ దక్కనున్నట్లు సమాచారం. 


ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు...

ఎన్నికలు ఏవైనప్పటికీ జిల్లాలో టీఆర్‌ఎస్‌ గెలుపు అప్రతిహతంగా కొనసాగుతున్నది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ఆదివారం జరిగిన పీఏసీఎస్‌ ఎన్నికల వరకు జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, పీఏసీఎస్‌ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌ది కావడంతో ప్రతిపక్షాలకు పాలుపోని పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరాయి. గత పాలకుల హయాంలో సంక్షేమ పథకాలంటేనే పైరవీకారులకు కాసులు కురిపించేవిగా ఉండేవి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. తద్వారా సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి కుటుంబం టీఆర్‌ఎస్‌ పాలనను కోరుకుంది. అందువల్ల ప్రతి ఎన్నికల్లో సైతం ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతోపాటు అభివృద్దిలోను జిల్లా దూసుకుపోతున్నది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమనేది ప్రజల భావన. తద్వారా ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అఖండ విజయం చేకూరుస్తూ మరింత చక్కటి పాలన అందించేందుకు దోహదం చేస్తున్నారు.


logo