శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Feb 17, 2020 , 00:12:02

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

విద్యార్థులు భయంతో గడుపవద్దని ధైర్యంగా ఉండాలని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. ఆమె మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ధైర్యం నూరిపోశారు. శనివారం రాత్రి భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థకు గురైన నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆమె గురుకుల పాఠశాలను సందర్శించారు.

  • వైద్య శిబిరం కొనసాగించాలి
  • బొంరాస్‌పేట గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ పౌసుమి బసు
  • విద్యార్థుల అస్వస్థతకు కారణాలపై ఆరా

బొంరాస్‌పేట : విద్యార్థులు  భయంతో గడుపవద్దని ధైర్యంగా ఉండాలని  కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. ఆమె మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ధైర్యం నూరిపోశారు. శనివారం రాత్రి భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థకు గురైన నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆమె గురుకుల పాఠశాలను సందర్శించారు.    ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్టాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, చేతివేళ్లకు గోర్లను కత్తిరించి నీట్‌గా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏం కాదని వైద్యులు ఇక్కడే ఉండి బాగోగులను చూసుకుంటారని కలెక్టర్‌ చెప్పారు. డైనింగ్‌ హాల్‌ను, వాటర్‌ ఫిల్టర్‌ను, బియ్యం, పప్పు, వంటనూనె తదితర వంట సామగ్రిని పరిశీలించారు. వాటర్‌ ట్యాంకును ఎన్ని రోజులకోసారి శుభ్రం చేస్తారని సిబ్బందిని ప్రశ్నించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడుతూ శనివారం రాత్రి ఏం తిన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని కలెక్టర్‌ అడిగారు. రాత్రిపూట అన్నం, ఆలుగడ్డ కూర తిన్నామని,  తిన్న కొంచెం సేపటి తర్వాత కడుపునొప్పితో వాంతులు చేసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఇంకా ఏమైనా కొత్తగా తిన్నారా, ఏమైనా ఇబ్బంది అవుతుందా అని కలెక్టర్‌ ప్రశ్నించారు. కలెక్టర్‌ ప్రశ్నలు అడుగుతుండగా ఒకరిద్దరు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకోగా ఎందుకు ఏడుస్తున్నారు, ఏం కాదు భయపడ వద్దు అని సముదాయించారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ ఏమైనా జరిగిందా అని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్‌ను అడిగారు. అలాంటిది ఏమీ లేదని డాక్టర్‌ సమాధానమిచ్చారు. ఉడకని అన్నం, పులుపు ఎక్కువగా ఉన్న కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. విద్యార్థులకు అందించడానికి వైద్య సిబ్బంది టేబుల్‌పై ఉంచిన మందులను చూసిన కలెక్టర్‌ ఇంత మొత్తంలో మాత్రలు ఎందుకు ఉంచారని, విద్యార్థులు వీటిని చూసి భయపడే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల్లో ధైర్యం, విశ్వాసం కల్పించేందుకు చిన్న చిన్న ఆటలు ఆడించాలని వ్యాయామ ఉపాధ్యాయుడిని కలెక్టర్‌ పౌసుమి బసు ఆదేశించారు. రెండు రోజులపాటు వైద్య సిబ్బంది ఇక్కడే ఉండాలని విద్యార్థులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ సాయంత్రం తనకు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు పంపాలని డీఎంహెచ్‌వో దశరథ్‌ను ఆదేశించారు. విద్యార్థులు మొదటి సారిగా అస్వస్థతకు గురికావడంతో కొంచెం భయంగా కూడా ఉన్నారని కలెక్టర్‌ చెప్పారు. తినడానికి కిచిడీ లాంటిది వండి పెట్టాలని వంట వారిని ఆదేశించారు. 


మాకు సమాచారం ఇవ్వలేదు: తల్లిదండ్రుల ఫిర్యాదు

తమ పిల్లలు అస్వస్థతకు గురైతే పాఠశాల ప్రిన్సిపాల్‌ తమకు సమాచారం ఇవ్వలేదని విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లు ఉన్నాయా ? ఉంటే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రిన్సిపాల్‌ మహబూబ్‌పాషాను కలెక్టర్‌ ప్రశ్నించారు. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు తరలి వచ్చారు. కలెక్టర్‌ వెంట డీఎంహెచ్‌వో దశరథ్‌, మండల వైద్యాధికారి రవీంద్రయాదవ్‌, కొడంగల్‌ తహసీల్దార్‌, సర్పంచ్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


 పాఠశాల నుంచి వచ్చే మురికి నీటితో ఇబ్బందులు

మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి వచ్చే మురికి నీటితో తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మురుగునీరు వెళ్లకుండా కమ్యూనిటీ ఇంకుడు గుంతను ఎందుకు నిర్మించలేదని పంచాయతీ కార్యదర్శి డేవిడ్‌ను కలెక్టర్‌ ప్రశ్నించారు. చవుడు నేల ఉన్నందున మురికినీరు భూమిలో ఇంకే అవకాశం లేదని కార్యదర్శి చెప్పారు. ఎంపీవోతో మాట్లాడి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


 నమూనాలు సేకరించి పంపండి

విద్యార్థులకు వంటలు వండటానికి ఉపయోగిస్తున్న బియ్యం, పప్పు, చింతపండు, వంటనూనెల శాంపిళ్లను సేకరించి తనకు పంపించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  ఏమైనా కల్తీ జరిగిందా లేదా తెలుసుకోవడానికి వాటిని పరీక్షలకు పంపిస్తామని కలెక్టర్‌  ప్పారు. కలెక్టర్‌ ఆదేశాలతో కొడంగల్‌ తహసీల్దార్‌ బియ్యం, పప్పు, చింతపండు, నూనెల నమూనాలను తీసుకుని పంపించారు. 


 సందర్శించిన అదనపు కలెక్టర్‌, జడ్పీటీసీ  

 మండలంలోని చిల్‌ముల్‌ మైలారం మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం  అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, జడ్పీటీసీ చౌహాన్‌ అరుణాదేశు సందర్శించారు. రాత్రి భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన వివరాలను అరుణాదేశు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌, తల్లిదండ్రులతో ఆమె మాట్లాడారు. వంటగదిని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి పెట్టాలని మరోసారి ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలని అరుణాదేశు పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఏమీ కాదని ఎలాంటి భయాందోళనకు గురికావద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. అస్వస్థతకు గురైన కొంతమంది విద్యార్థులకు పాఠశాలలోనే స్లైన్‌ ఎక్కించి చికిత్స అందిస్తున్నారు. 


logo