శుక్రవారం 29 మే 2020
Vikarabad - Feb 16, 2020 , 00:04:00

సహకారం టీఆర్‌ఎస్‌దే

సహకారం టీఆర్‌ఎస్‌దే
  • మెజార్టీ సొసైటీలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ
  • జిల్లా అంతటా గులాబీ శ్రేణుల సంబురాలు
  • కాంగ్రెస్‌-47 వార్డులు, 2 వార్డులతో సరిపెట్టుకున్న బీజేపీ
  • ఎన్నికలు జరిగిన 184 వార్డుల్లో 135 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు
  • పూర్తిగా ఏకపక్షంగా జరిగిన సహకార సంఘం ఎన్నికలు
  • పూడూరులో మాత్రం కాంగ్రెస్‌ కైవసం
  • 19 సొసైటీల్లో 18 టీఆర్‌ఎస్‌ విజయకేతనం
  • జిల్లాలోని 21 సొసైటీలపై టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలు
  • సీఎం కేసీఆర్‌కే జైకొట్టిన జిల్లా రైతాంగం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ విజయఢంకా మోగించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లోనూ కారు జోరు ఏ మాత్రం తగ్గలేదనేది జిల్లా రైతాంగం నిరూపించింది. వరుసగా అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించిన సబ్బండ వర్గాల ప్రజలు సహకార సంఘం ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ను గెలిపించి, ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదనే విధంగా మరోసారి తీర్పునిచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కే జిల్లా రైతులందరూ జైకొట్టారు. సహకార ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్‌ గెలుపులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సబితారెడ్డితో పాటు కొడంగల్‌, పరిగి, తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే సహకార ఎన్నికల్లోనూ ఓటర్లు ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికలు జరిగేంత వరకు కేవలం ఒక్క సొసైటీలో మినహా ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పోటీనివ్వలేకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో చాలా వరకు కాంగ్రెస్‌ పార్టీ సొసైటీలను కైవసం చేసుకోగా, ఈ ఎన్నికల్లో పూర్తిగా టీఆర్‌ఎస్‌ వైపు విజయం వరిస్తూ పూర్తిగా ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. అయితే వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్‌ పార్టీకి సహకార ఎన్నికలు కూడా ఘోర ఓటమిని మిగిల్చింది. మరోవైపు సహకార ఎన్నికల్లో బీజేపీ ఒకట్రెండు సొసైటీల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ కేవలం రెండు వార్డుల్లోనే గెలుపొందింది. మరో వైపు జిల్లాలోని 22 సొసైటీలకుగాను 21 సొసైటీలకు టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడంతో జిల్లా అంతటా గులాబీ శ్రేణుల సంబురాలు జరుపుకున్నారు. 

మెజార్టీ సొసైటీల్లో గులాబీ జెండా...

జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురులేదనేది సహకార ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైంది. జిల్లాలోని మెజార్టీ సొసైటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని 22 సొసైటీలనుకుగానూ ఏకగ్రీవాలతో కలుపుకొని 21 సొసైటీల్లో విజయకేతనం ఎగురవేసింది. మరో 1 సొసైటీలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందింది. అయితే జిల్లాలో 22 సొసైటీల్లో హస్నాబాద్‌, కులకచర్ల, ఎక్‌మామిడి సొసైటీల్లో ఏకగ్రీవ ఎన్నికతో టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోగా, మిగతా 19 సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. ఒక్క పూడూరు సొసైటీలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందగా, మిగిలిన 18 సొసైటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. జిల్లాలోని 22 సొసైటీల్లో 286 వార్డులుండగా ఏకగ్రీవాలతో కలుపుకొని టీఆర్‌ఎస్‌ 228 వార్డుల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ 56 వార్డుల్లో, బీజేపీ -2 వార్డుల్లో గెలుపొందింది. మరోవైపు ఏకగ్రీవాలతో కలుపుకొని హస్నాబాద్‌, కులకచర్ల, ఎక్‌మామిడి, యాలాల, నవాంగి, పరిగి, ఎల్మకన్నె, మోమిన్‌పేట, కొత్తగడి సొసైటీల్లోని అన్ని వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. అదేవిధంగా ఎన్నికలు జరిగిన 184 వార్డుల్లో 135 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధించగా, 47 వార్డుల్లో కాంగ్రెస్‌, 2 వార్డుల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. శివారెడ్డిపేట సొసైటీలోని 11 వార్డులకు ఎన్నికలు జరుగగా 9 వార్డుల్లో టీఆర్‌ఎస్‌, 2 వార్డుల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారు. కొత్తగడిలో 2 వార్డులకు ఎన్నికలు జరుగగా రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌, వట్టిమీనపల్లిలో 11 వార్డులకు ఎన్నికలు జరుగగా 9 టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌-2, ధారూరులో 10 వార్డులకుగాను టీఆర్‌ఎస్‌-7, కాంగ్రెస్‌-3, హరిదాసుపల్లిలో 1 వార్డుకు జరిగిన ఎన్నికలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు గెలుపొందాడు.

పూడూరులో 12 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-6, కాంగ్రెస్‌-6 వార్డులు, మోమిన్‌పేటలో 8 వార్డులకు ఎన్నికలు జరుగగా అన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌ గెలిచింది. మేకవనంపల్లిలో 11 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-6, కాంగ్రెస్‌-5, పెద్ద మర్పల్లిలో 13 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-5 వార్డులు, బంట్వారంలో 11 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-7, కాంగ్రెస్‌-4 వార్డులు, తట్టేపల్లిలో 13 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-5 వార్డులు, పెద్దేముల్‌లో 4 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-3, కాంగ్రెస్‌-1, ఎల్మకన్నెలో 10 వార్డులకు ఎన్నికలు జరుగగా 10 వార్డుల్లోను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. యాలాలలో 12 వార్డులకు ఎన్నికలు జరుగగా అన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలుపొందారు. నవాంగిలో 12 వార్డులకు ఎన్నికలు జరుగగా అన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌ విజయం, దౌల్తాబాద్‌లో 11 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-5, కాంగ్రెస్‌-6 వార్డులు, మెట్లకుంటలో 12 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-7, కాంగ్రెస్‌-5 వార్డులు, మోత్కూర్‌లో 12 వార్డులకు ఎన్నికలు జరుగగా టీఆర్‌ఎస్‌-7, కాంగ్రెస్‌-3, బీజేపీ -2 వార్డులు, పరిగిలో 8 వార్డులకు ఎన్నికలు జరుగగా అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించింది.  

టీఆర్‌ఎస్‌ను గెలిపించిన రైతు సంక్షేమ పథకాలు...

సహకార ఎన్నికల్లో రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే ప్రచారస్త్రంగా ముందుకెళ్లిన టీఆర్‌ఎస్‌ వ్యూహం విజయవంతమైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను రాబట్టడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ సక్సెస్‌ అయ్యింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేసిన ప్రభుత్వం,..రెండేండ్లలోనే వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తుండడం, అదేవిధంగా రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం, మరోసారి రూ.లక్ష రుణమాఫీని చేసేందుకు కసరత్తు జరుగుతుండడాన్ని ప్రచారంలో రైతులకు వివరించారు. అదేవిధంగా రైతులు అప్పుల ఉబిలో నుంచి కాపాడేందుకుగాను పంటలను సాగుకు పెట్టుబడి సాయందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ, మొదట ఎకరాలకు రూ.8 వేల ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తుండడం, అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకుగాను ఏదేని రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5 లక్షల బీమాను అందజేయడంలాంటి పథకాలను తమ మద్దుతుదారుల తరపున టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారంలో భాగంగా రైతుల్లోకి తీసుకెళ్లి సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ సొసైటీలను కైవసం చేసుకోవడంలో సక్సెస్‌ అయ్యారు.  

గెలుపులో మంత్రి, ఎమ్మెల్యేల కీలకపాత్ర...

సహకార ఎన్నికల గెలుపులో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సబితారెడ్డి కృషి ఎంతో ఉంది. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని, ప్రచారం తదితర అన్నింటిలోనూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసిన మంత్రి సొసైటీ ఎన్నికల గెలుపులో కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే మద్దతివ్వాలని సూచించడంతో పాటు ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం సహకార ఎన్నికల బాధ్యతలను కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపులో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారు. జిల్లాలోని కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, పైలట్‌ రోహిత్‌రెడ్డి అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ప్రచారం వరకు పక్కా గెలుపు వ్యూహంతో ముందుకెళ్లారు. ప్రతి సొసైటీలో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యేలు ముందుకెళ్లారు. ఆయా సొసైటీల్లోని చాలా వార్డులను ఏకగ్రీవం చేయడంలో, హస్నాబాద్‌, కులకచర్ల, ఎక్‌మామిడి సొసైటీలను ఎన్నిక లేకుండానే ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పక్కా వ్యూహంతో ముందుకెళ్లి సక్సెస్‌ అయ్యారు. 

 పోలింగ్‌ 74 శాతం...

సహకార ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్‌ జరుగగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. జిల్లావ్యాప్తంగా 19 సోసైటీల్లోని 184 వార్డులకు ఎన్నికలు జరుగగా 74 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభంకాగా ఉదయం 8 గంటల వరకు జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ మందకోడిగా సాగింది. అనంతరం ఉదయం 8 గంటల తర్వాత పోలింగ్‌ శాతం పుంజుకోవడంతో పాటు దాదాపు ఎన్నికలు జరిగిన అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే జిల్లాలోని 19 సొసైటీల్లోని మొత్తం 184 వార్డుల్లో 45,973 మంది ఓటర్లుండగా 34,022 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల వరకు 2,970 (6.5 శాతం) ఓట్లు పోలుకాగా, పురుషులు-2,249, మహిళలు-721 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 9 గంటల వరకు 8,859 (19.43 శాతం) ఓట్లు పోలుకాగా, పురుషులు-6,855, మహిళలు 2,004 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10 గంటల వరకు 35 శాతం పోలింగ్‌ నమోదుకాగా 16,174 ఓట్లు పోలవగా పురుషులు-12,088, మహిళలు-4,086 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 11 గంటల వరకు 54.69 శాతం పోలింగ్‌ నమోదుకాగా, 25,146 ఓట్లు పోలయ్యాయి, వీరిలో పురుషులు-18,601, మహిళలు-6,545 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 66.09 శాతం పోలింగ్‌ నమోదుకాగా, 30,793 ఓట్లు పోలయ్యాయి, వీటిలో పురుషులు-22,959, మహిళలు-7,834 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి వరకు 74 శాతం పోలింగ్‌ నమోదుకాగా 34,022 ఓట్లు పోలయ్యాయి, వీటిలో పురుషులు-25,564 ఓట్లు, మహిళలు-8,458 ఓట్లు పోలయ్యాయి. 


logo