శనివారం 30 మే 2020
Vikarabad - Feb 14, 2020 , 23:43:10

గంటలోనే ఫలితాలు

గంటలోనే ఫలితాలు
  • హరిదాసుపల్లి సొసైటీదే తొలి ఫలితం
  • జిల్లాలోని 184 ప్రాదేశిక నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలు
  • పోలింగ్‌ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి
  • మధ్యాహ్నం 3గంటల వరకు..
  • అన్ని సొసైటీల్లో గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమా

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల ఫలితాలు గంటలో వెళ్లడవనున్నాయి. సహకార సంఘాల్లో తక్కువ సంఖ్యలో ఓటర్లున్న దృష్ట్యా మొదటి గంటలోనే ఫలితాలను వెల్లడించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలి, మధ్యాహ్నం 3గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడంతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ఎన్నికల సిబ్బందే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లోని బూతుల వారీగా టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. మొదటగా ఒకే వార్డుకు మాత్రమే ఎన్నికలు జరుగనున్న హరిదాసుపల్లి సొసైటీ ఎన్నిక ఫలితాలు తొలుత, చివరగా పెద్ద మర్పల్లి సొసైటీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు నేడు జరుగనున్న సహకార సంఘాల ఎన్నికలకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగనుంది. ఎన్నికలు జరుగనున్న అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సరిపడా బ్యాలెట్‌ బాక్సులతో పాటు ఎన్నికల సామగ్రితో శుక్రవారం సాయంత్రం వరకు ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా పోలిస్‌ యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది. మరోవైపు జిల్లాలో కుల్కచర్ల, హస్నాబాద్‌, ఎక్‌మామిడి సహకార సంఘాల్లోని అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నిక ఏకగ్రీవమైన దృష్ట్యా 19 సహకార సంఘాల్లోని 184 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనుండగా 402మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే జిల్లాలోని ఆయా సొసైటీల్లోని 45,973 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

నేడే పోలింగ్‌...

సహకార ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులతోపాటు ఇతర ఎన్నికల సామగ్రిని చేరవేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 19 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 184 వార్డులకు ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ప్రతీ వార్డుకు ఒక పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి పోలింగ్‌ బూతుకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి, ఒక ఇతర ప్రిసైడింగ్‌ అధికారిని నియమించారు. 184వార్డులకుగాను 552మంది పీవో, ఏపీవో, వోపీవోలను ఎన్నికల నిర్వహణకు నియమించారు. జిల్లాలోని 19 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 184 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలోని కుల్కచర్ల, హస్నాబాద్‌, ఎక్‌మామిడి సోసైటీల్లోని 13ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. వీటితో పాటు మిగతా సొసైటీల్లోని 102వార్డుల్లో కూడా ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. 19 సొసైటీల్లోని 184 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి, ఎన్నికలు జరుగనున్న ఆయా వార్డులకు సంబంధించి శివారెడ్డిపేట్‌ సొసైటీలోని 11వార్డులకు, కొత్తగడిలో 2 వార్డులు, వట్టిమీనపల్లిలో 11 వార్డులు, ధారూర్‌లో 10 వార్డులు, హరిదాసుపల్లిలో 1 వార్డు, పూడూర్‌లో 12 వార్డులకు, మోమిన్‌పేట్‌లో 8 వార్డులకు, మేకవనంపల్లిలో 11 వార్డులకు, పెద్ద మర్పల్లిలో 13 వార్డులకు, బంట్వారంలో 11 వార్డులకు, తట్టేపల్లిలో 13 వార్డులకు, పెద్దేముల్‌లో 4 వార్డులకు, ఎల్లంకన్నలో 10 వార్డులకు, యాలాలలో 12 వార్డులకు, నవాంగిలో 12 వార్డులకు, దౌల్తాబాద్‌లో 11వార్డులకు, మెట్లకుంటలో 12 వార్డులకు, మోత్కూర్‌లో 12 వార్డులకు, పరిగిలో 8 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.  

ఓటు హక్కు వినియోగించుకోనున్న 45,973 ఓటర్లు

జిల్లాలో ఎన్నికలు జరుగనున్న 19సొసైటీల్లోని 184వార్డుల ఎన్నికల్లో 45,973మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరుగనున్న ఆయా సోసైటీల్లోని ఓటర్లకు సంబంధించి శివారెడ్డిపేట్‌ సొసైటీలో 3168 మంది ఓటర్లు, కొత్తగడిలో 126, వట్టిమీనపల్లిలో 3092, ధారూరులో 3370, హరిదాసుపల్లిలో 28, పూడూరులో 4191, మోమిన్‌పేట్‌లో 2064, మేకవనంపల్లిలో 1140, పెద్ద మర్పల్లిలో 4691, బంట్వారంలో 2934, తట్టేపల్లిలో 1922, పెద్దేముల్‌లో 599, ఎల్లంకన్నలో 1650, యాలాలలో 2796, నవాంగిలో 3202, దౌల్తాబాద్‌లో 2645, మెట్లకుంటలో 2420, మోత్కూర్‌లో 3936, పరిగిలో 1999 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

గెలుపుపై అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ధీమా...

వరుస ఎన్నికల్లో విజయఢంకా మోగించిన అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సహకార ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ ఖాయమని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని హస్నాబాద్‌, కుల్కచర్ల, ఎక్‌మామిడి సొసైటీలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే గండీడ్‌ సొసైటీని కూడా ఏకగ్రీవ ఎన్నికతో టీఆర్‌ఎస్‌ పార్టీయే కైవసం చేసుకుంది. వీటితోపాటు ప్రతి సొసైటీలోని పలు వార్డుల్లో సైతం టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను ఏకగ్రీవంగా గెలిపించుకుంది. ఏకగ్రీవమైన 102 వార్డుల్లో 90కిపైగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు మాత్రమే ఎన్నికవడం గమనార్హం. 

అంతేకాకుండా నేడు ఎన్నికలు జరుగనున్న 184 వార్డుల్లో కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొంద డం ఖాయమని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కైవసం చేసుకొని జిల్లాస్థాయి పదవులైన డీసీసీబీతోపాటు డీసీఎంఎస్‌ పదవులను కూడా తమ ఖాతాలోనే వేసుకోవడం ఖాయమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నమ్మకంతో ఉన్నారు. సహకార ఎన్నికల్లో మొదటి నుంచి ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించి దూరంగా ఉన్న దృష్ట్యా జిల్లాలోని అన్ని సొసైటీలపై గులాబీ జెండా ఎగురడం ఖాయంగా కనిపిస్తుంది.


logo