శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 12, 2020 , 23:50:39

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
  • గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
  • 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలి
  • సమయానుసారంగా వైద్య సేవలు అందించాలి
  • ఇందూరు ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డా. సాయిబాబా

పెద్దేముల్‌ : విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని జిల్లా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. సాయిబాబా అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఇందూరులోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి పలు రికార్డులను, సిబ్బంది హాజరు వివరాలని, నిర్వహిస్తున్న వైద్యసేవలను తనిఖీ చేశారు. ఈ సందర్భం గా ఆయన సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఇందూర్‌ పరిధిలో ఉన్న గర్భిణులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను సమయానుసారంగా అందించాలని, ముఖ్యంగా గర్భిణులకు 1,2వ సారి ఆరోగ్య పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 3,4వ సారి ఆరోగ్య పరీక్షలను తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో చేయించాలని అన్నారు. గర్భిణులను గ్రామాల నుంచి తాండూరు ఆసుపత్రికి తరలించడానికి ప్రభుత్వం ఉచితంగా 102 వాహనాన్ని అందుబాటు లో ఉంచిందని, ఈ సదుపాయాన్ని ఆయా గ్రామా ల ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్‌లు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని, వారికి సమయానుసారంగా వైద్యపరీక్షలు చేయించాలని, వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా తనిఖీల్లో భాగంగా ఉప కేంద్రంలోని పలు రికార్డులను, గర్భిణుల వివరాలను, సిబ్బంది హాజరు వివరాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. శ్రావణ్‌ కుమార్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు సునీత, సుజాత, ఆశవర్కర్లు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


logo