శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Feb 12, 2020 , 23:40:28

కందుల కొనుగోలుపై రైతుల హర్షం

కందుల కొనుగోలుపై రైతుల హర్షం

కొడంగల్‌ రూరల్‌ : కొడంగల్‌ ప్రాంతంలో అత్యధికంగా రైతులు కంది పంటను సాగు చేస్తారు. రైతులు పండించిన వివిధ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం జరుగుతున్నది. దీంతో రైతులందరూ కొడంగల్‌ మార్కెట్‌ యార్డు నందు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో డీసీఎంఎస్‌ ద్వారా మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం కందులకు కూడా మద్దతు ధర కల్పించడంతో కందుల కొనుగోలు కేంద్రానికి భారీగా కందులు వస్తున్నాయి. కంది పంట రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.5,800ల ధరను ప్రకటించారు. దీని ప్రకారం డీసీఎంస్‌ అధికారులు రైతుల నుంచి కందులను కొనుగోలు చేస్తున్నారు. బయట వ్యాపార సముదాయాల్లో రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కందుల కొనుగోలు కేంద్రానికి ఎక్కువగా రైతులు తమ పంటను తేవడానికి మొగ్గు చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రతి రైతు దగ్గర 2.5 క్వింటాల్‌ కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది. దీంతో తాము పండించిన మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు అనేక మార్లు ఆందోళనలు చేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సంబంధిత మంత్రిని కలిసి సమస్యను వివరించారు. రైతుల నుంచి ఎకరాకు ఐదు క్వింటాళ్లు కందులు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారులకు అనుమతులు కూడా రావడంతో బుధవా రం కొనుగోలు కేంద్రానికి రైతులు అధిక సంఖ్యలో కందుల బస్తాలను తరలించారు. 


బయట మార్కెట్‌లో కంటే కొనుగోలు కేం ద్రంలో అధిక ధర రావడం, మార్కెట్‌ ఖ ర్చులు, హమాలీ ఖర్చులు లేకపోవడంతో కొనుగోలు కేంద్రంలో రైతులకు మేలు జరుగుతున్నది. కొన్ని రోజులుగా వస్తున్న కందులతో కొడంగల్‌లోని కొనుగోలు కేంద్రం రైతులతో కిక్కిరిసిపోతున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ చూపుతూ తగినన్ని కాంటాలను ఏర్పాటు చేసి కందులను కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డులో డీసీఎంఎస్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జి తేజోరాణి మాట్లాడుతూ గత నెల 22న ప్రారంభించిన కందుల కొనుగోలు కేంద్రంలో నేటి వరకు 16509 క్వింటాళ్ల కందులు, 1070 మంది రైతుల దగ్గర కొనుగోలు చేసినట్లు  తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం ప్రతి రైతు దగ్గర ఎకరానికి ఐదు క్వింటాళ్లు కందులు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా 15 రోజుల లోపు వారివారి ఖాతాల్లో డబ్బు లు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు భూమి పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు   ఆధారంగానే కొనుగోళ్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర ప్రకటిం చి ఎకరాకు ఐదు క్వింటాళ్లు కొనుగోలు చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo