మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Feb 11, 2020 , 23:26:48

పథకాల అమలుకు ప్రాధాన్యమివ్వాలి

పథకాల అమలుకు ప్రాధాన్యమివ్వాలి
  • గ్రామాల అభివృద్ధికి ప్రతినెల నిధులు విడుదల
  • మార్పు రాకుంటే ఊరుకునేది లేదు
  • పల్లెప్రగతి నిరంతర కార్యక్రమం
  • 15 రోజుల్లో జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం
  • త్వరలో మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి
  • విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లదే..
  • సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి
  • కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, చట్టాలు, విధానాల అమలుకు కలెక్టర్లు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌ పలు అంశాలపై కలెక్టర్లకు, అదనపు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికై ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఉండాలని, వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని సూచించారు. పేద ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, కంటి వెలుగు లాంటి పథకాలను జిల్లాస్థాయిలో అమలుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. అదేవిధంగా పల్లెప్రగతి మాదిరిగానే త్వరలో మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రతినెల నిధులు విడుదల చేస్తున్నామని, ఇకపై గ్రామ పంచాయతీల్లో మార్పు రాకుంటే ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. అదేవిధంగా పల్లెప్రగతి కార్యక్రమం నిరంతర కార్యక్రమమని, 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పులు తీసుకువచ్చేందుకుగాను పదిహేను రోజుల్లో జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకుగాను కలెక్టర్ల వద్ద రూ.కోటి నిధులను అందుబాటులో ఉంచుతున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకునే బాధ్యత కలెక్టర్లదేనన్నారు. 


త్వరలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం...

గ్రామాల రూపురేఖలు మార్చేందుకుగాను పదిహేను రోజుల్లో జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలని, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, జడ్పీటీసీలను సభ్యులుగా ఆహ్వానించి గ్రామాలాభివృద్ధికి చేసే పద్ధతి వారికి వివరించి విధులు, బాధ్యతలను వారికి తెలియజేసి పది రోజుల గడువిచ్చి గ్రామాల రూపురేఖలు మార్చాలని సభ్యులకు తెలపాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలని, తదనంతరం ఆకస్మికంగా పర్యటిస్తామని, ఏ గ్రామంలోనైతే అనుకున్న విధంగా మార్పు రాలేనట్లయితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. గ్రామాలను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లిన వారికి అవార్డులతోపాటు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అదేవిధంగా పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉండాలని, హరితహారంలో గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం ఖచ్చితంగా బతకాలని, ప్రతి గ్రామంలో తప్పనిసరిగా శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో విరివిగా మొక్కలను నాటడంతోపాటు సంరక్షించాలని, గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలని, చెత్త చెదారాన్ని తొలిగించడం, పాడుపడిన బావులను పూడ్చడం, బోరుబావులను పూడ్చడంలాంటి పనులను గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరిపించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. అదేవిధంగా పంచాయతీల అభివృద్ధికి నిధుల కొరత సమస్య లేకుండా ప్రతినెల రూ.339 కోట్ల నిధులను విడుదల చేస్తున్నామని, అన్ని గ్రామాలకు కార్యదర్శులను నియమించడంతోపాటు పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచడం, ప్రతి గ్రామానికి ట్రాక్టర్లను సమకూర్చే అవకాశాన్ని కల్పించామని సీఎం అన్నారు. 


సంపూర్ణ అక్షరాస్యత బాధ్యత కలెక్టర్లదే..

ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌ లాంటి కార్యక్రమాలతో నిరాక్షరాస్యులందరిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని, ఆయా గ్రామాల్లో ఉన్న నిరాక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లేదనని సీఎం అన్నారు. సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా పొందుపర్చాలని, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని, ఏ కార్యక్రమాన్ని అమలుచేసినా గిరిజనతండాల నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రధానంగా పల్లెలు, పట్టణాలు పరిశుభ్రతతో వెల్లివిరియడం అత్యంత ప్రాధాన్యమని దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 


logo