మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 11, 2020 , 00:03:06

‘ఆల్బెండజోల్‌' తప్పనిసరి వేయించాలి

‘ఆల్బెండజోల్‌' తప్పనిసరి వేయించాలి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : పరిశుభ్రతతోనే నులిపురుగులను నివారించవచ్చని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా సోమవారం స్థానిక సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి  కలెక్టర్‌, ఎమ్మెల్యేలు హాజరై పిల్లలకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పౌసుమి బసు మాట్లాడుతూ అపరిశుభ్రత వల్ల పిల్లలకు నులిపురుగులు సంక్రమిస్తాయని, పరిసరాలతో పాటు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పిల్లలు పరిశుభ్రత పాటిస్తే నులిపురుగులను నివారించవచ్చని సూచించారు. పరిశుభ్రమైన పోషకాహారం తీసుకొని ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలన్నారు. నులిపురుగుల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  తోటి చిన్నారులకు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. 19 ఏండ్ల పిల్లలందరూ తప్పనిసరిగా నులి పురుగుల మాత్రలు వేయించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్త హీనత, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. 


అపరిశుభ్రమైన చేతులతో ఆహారం తిన్నప్పుడు బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లి కడుపులో నొప్పి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.  అనంతరం చిన్నారులకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌,  కలెక్టర్‌ పౌసుమి బసు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, జిల్లా వైద్యాధికారి దశరథ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్‌, డాక్టర్లు లలిత, వినోద్‌రెడ్డి, ఎస్‌వో రాజేశ్వర్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు. 


logo