ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 10, 2020 , 23:58:45

నేటి నుంచి పహిల్వాన్‌షావలి దర్గా ఉర్సు

నేటి నుంచి పహిల్వాన్‌షావలి దర్గా ఉర్సు

షాబాద్‌, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌ ప్రాంతవాసుల ఆరాధ్య దైవం పహిల్వాన్‌షావలి దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 11నుంచి ప్రారం భంకానున్నాయి. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలు వారం పాటు కొనసాగుతాయని ఉర్సు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా 11న మంగళవారం గంధం కార్యక్రమం ఉంటుంది. రాత్రి పది గంటలకు మల్కీబావి సమీపంలో ఉన్న దర్గా నుంచి గంధం భారీగా ఊరేగింపు జరుగుతుంది. 12న చిరాగాన్‌ (ధీపారధన), కవ్వాలీ, 13న మీనాబజార్‌ ఉంటుంది.


దర్గా చరిత్ర...

షాబాద్‌ ప్రాంతంలో పహిల్వాన్‌షావలి సజీవ సమా ధి కావడంతో ఈ దర్గాకు పహిల్వాన్‌షావలి దర్గాగా పేరు వచ్చింది. సుమారు 410 ఏండ్ల చరిత్ర ఈ దర్గా సొంతం. ఆ కాలంలో షాబాద్‌ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అయితే నిజాం వంశానికి చెందిన మాలిక్‌షా కుష్టువ్యాధిగ్రస్తుడై మనస్థాపంతో అడవులపాలయ్యాడు. అడవిలో తిరుగుతూ షాబాద్‌ ప్రాంతంలోని ప్రస్తుత చెరువు గట్టుపైన పహిల్వాన్‌షావలి దర్గా సమీపంలోని రావి వృక్షం కింద సేద తీర్చుకున్నాడు. మాలిక్‌షాకు స్వప్నంలోకి దివ్యస్వరూపుడు ఒకరు వచ్చి సమీపంలోని మల్కీబావిలో నీళ్లు తాగి చెరువు పక్క నే ఉన్న ప్రస్తుత పహిల్వాన్‌షావలి దర్గా వద్ద రావిచెట్టు కింద ప్రార్థన చేయాలని సూచించాడు. దీంతో మాలిక్‌షా అదేవిధంగా చేసి వ్యాధి నుంచి విముక్తి పొంది నిజాం వారసత్వంలో ఉన్నత స్థానాన్ని పొం దారు. వెంటనే మాలిక్‌షా షాబాద్‌లో దర్గా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటివరకు ఈ ప్రాంతంలోని అన్ని మతాల ప్రజలు సమైక్యంగా ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తూ పహిల్వాన్‌షావలి అనుగ్రహం పొందుతున్నారు. ఈ ఉత్సవాల్లో షాబాద్‌ మండల ప్రజలే కాకుండా మహబూబ్‌నగర్‌, రం గారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల నుంచి భక్తులు వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు. 


ఏర్పాట్లు పూర్తి... 

వారం పాటు సాగే షాబాద్‌ పహిల్వాన్‌ షావలి ఉర్సు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎటువం టి అసౌకర్యాలు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ దర్గాకు రంగులువేసి అందమైన విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు. షాబాద్‌ పహిల్వాన్‌ షావలి దర్గా ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. షాద్‌నగర్‌, అప్జల్‌గంజ్‌, మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌, మహేశ్వరం తదితర డిపోలకు చెందిన బస్సులు అరగంటకో బస్సు వస్తుంది.  


హాజరుకానున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

షాబాద్‌లో జరిగే ఉర్సు ఉత్సవాలకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల, కొడంగల్‌ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి హాజరవుతున్నట్లు ముస్లిం సోదరులు తెలిపారు. ఉత్సవాలసందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా షాబాద్‌ ఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


logo