సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 09, 2020 , 23:42:15

నులిపేద్దాం

నులిపేద్దాం
  • నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మాత్రల పంపిణీ
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • జిల్లాలో 3,01,343మంది పిల్లలు
  • కార్యక్రమాన్ని జయవంతం చేయాలి
  • డీఎంహెచ్‌వో దశరథ్‌వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 10, ఆగస్టు 10న రెండుసార్లు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని నిర్వహిస్తుంది. జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 ఏండ్లలోపు వయస్సు వారికి ఆల్బెండజోల్‌ మాత్రలు వేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో 3,01,343 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. వీరిలో 1 లక్ష 91 వేల మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, 68 వేల మంది అంగన్‌వాడీ కేంద్రాల్లో, 33 వేల మంది జూనియర్‌ కళాశాలల్లో, 7 వేల మంది బడిబయట పిల్లలున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రలు వేయనున్నారు. 10న మాత్రలు తీసుకోని వారి కోసం ఈనెల 17న మాత్రలు పంపిణీ చేయనున్నారు. 


అపరిశుభ్రతతో నులిపురుగులు

అపరిశుభ్రత వల్లే పిల్లలకు నులి పురుగులు సంక్రమిస్తాయి. పరిసరాలతోపాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన నీరు తాగాలి. బహిరంగ ప్రవేశాల్లో మల విసర్జన చేయడం వల్లే నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు కప్పి ఉంచాలి. 


నులిపురుగులంటే ఏమిటి ? కలిగే అనర్థాలు

నులి పురుగుల వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారిలో వీటి ప్రభావం కనిపిస్తుంది. నులి పురుగులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందుతాయి. వీటి వల్ల రక్తహీనత, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. 


ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాల్సిందే

పిల్లలలో సాధారణంగా మూడు రకాల నులిపురుగులు కనబడే అవకాశం ఉంది. ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు. వీటిని నిర్మూలించేందుకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు 400 ఎంజీ సగం 200 ఎంజీ మాత్రను వేసుకోవాలి. మిగతా వారు 400 ఎంజీ మాత్రను వేసుకోవాలి. మాత్రలు వేసుకున్న ఒకటి, రెండు రోజుల్లో నులిపురుగులు ఉంటే మలవిసర్జన ద్వారా బయటకు వెళ్తాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు వేసుకోకూడదు. నులిపురుగులు ఉన్నవారు మాత్రలు వేసుకుంటే వికారం, వాంతులయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశముంది. దాని వల్ల భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. 


జిల్లాలో భారీ ఎత్తున కార్యక్రమం

జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో 3,01,343 మంది బాలబాలికలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. నులిపురుగులు నివారించడమే లక్ష్యంగా వైద్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని అవగాహన కల్పించారు. ఫిబ్రవరి 10న వికారాబాద్‌లోని సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్‌ పౌసుమి బసు, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ పాల్గొంటారని జిల్లా వైద్యాధికారి దశరథ్‌ తెలిపారు. 


logo