శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Feb 09, 2020 , 23:36:07

నామినేషన్ల పరిశీలనలో గందరగోళం

నామినేషన్ల పరిశీలనలో గందరగోళం

పెద్దేముల్‌ : మండల పరిధిలోని తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో గందరగోళం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తట్టేపల్లి పీఎసీఎస్‌లోని 3వ వార్డు నుంచి జోగు హన్మంతు అనే అభ్యర్థి డైరెక్టర్‌ స్థానానికి శనివారం తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. కాగా నామినేషన్‌ సమయంలో ఆయన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌ మాత్రమే జతపరిచి ఇవ్వడం జరిగింది. కాగా ఆదివారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా ఎన్నికల అధికారి రజిత జోగు హన్మంతు కులం ధ్రువీకరణ పత్రం ఒరిజినల్‌ ఇవ్వకపోవడంతో అతని నామినేషన్‌ను ముందు తిరస్కరించారు. ఆ తరువాత హన్మంతు కులం ధ్రువీకరణ పత్రం ఒరిజినల్‌ ఇవ్వడంతో నామినేషన్‌ను స్వీకరించడం జరిగింది. విషయం తెలుసుకొన్న మాజీ డీసీసీబీ చైర్మెన్‌ పి.లక్ష్మారెడ్డి, గోపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రకాశం, నర్సింహులు, మొగులప్పలు ఒకసారి నామినేషన్‌ రిజక్ట్‌ చేసిన తరువాత మళ్లి ఎలా స్వీకరిస్తారని ఎన్నికల అధికారి రజితతో వాగ్వివాదానికి దిగారు. 


ఇష్టం వచ్చినట్లు నామినేషన్‌లు స్వీకరిస్తే నేను కూడా ఇప్పుడే నామినేషన్‌ వేస్తాను స్వీకరించండని మహిపాల్‌ రెడ్డి ఎన్నికల అధికారిని నిలదీశారు. ఈ విషయంలో ఎన్నికల అధికారిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని నాయకులు అన్నారు. దీంతో సుమారు 2గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తదుపరి కొద్దిసేపటి తరువాత నాయకులు ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోవడంతో వాతావరణం చల్లబడింది. ఈ విషయంలో ఎన్నికల అధికారి రజితను వివరణ కోరగా నామినేషన్‌ సమయంలో జోగు హన్మంతు కులం సర్టిఫికేట్‌ జిరాక్స్‌ కాపీ ని ఇవ్వడం జరిగిందని, పరిశీలన సమయంలో ఒరిజినల్‌ లేనందుకు ముందుగా రిజక్ట్‌ చేశానని, తదుపరి ఆయన ఒరిజినల్‌ ఇచ్చాక స్వీకరించి నామినేషన్‌ను కరెక్ట్‌ చేయడం జరిగిందని అన్నారు. తమకు ఏ పార్టీలతో పనిలేదని, ఎన్నికల నియమ నిబంధనలు ప్రకారమే తాను నామినేషన్ల పరిశీలనను నిర్వహించారు.


logo