సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 09, 2020 , 00:07:02

286 వార్డులు..930 నామినేషన్లు

286 వార్డులు..930  నామినేషన్లు
  • ఆఖరి రోజు 561దాఖలు
  • 15న సహకార ఎన్నికల పోలింగ్‌, అదేరోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు
  • నేడు నామినేషన్ల పరిశీలన
  • ఉపసంహరణకు రేపటితో ముగియనున్న గడువు
  • ధారూరు పీఏసీఎస్‌కు అధికంగా 76, హరిదాస్‌పల్లికి అత్యల్పంగా 17దాఖలు
  • ఒకే నామినేషన్‌ రావడంతో 25వార్డులు ఏకగ్రీవం..


వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల దాఖలకు శనివారం ఆఖరి రోజు కావడంతో జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన ఆయా పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలతో కోలాహలంగా కనిపించింది. అయితే జిల్లాలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 286 వార్డులకు శనివారం ఒక్కరోజే 561 నామినేషన్లు దాఖలుకాగా, మొదటి రోజు 65 నామినేషన్లు, రెండో రోజు 304 నామినేషన్లతో మొత్తం మూడు రోజుల్లో 930 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే జిల్లాలోని ధారూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అత్యధికంగా నామినేషన్లు దాఖలుకాగా, అత్యల్పంగా హరిదాస్‌పల్లి పీఏసీఎస్‌కు నామినేషన్లు దాఖలయ్యాయి. 


అదేవిధంగా జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని పలు వార్డులకు ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు కావడంతో జిల్లావ్యాప్తంగా 25 వార్డులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. మరోవైపు నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. జిల్లాలోని శివారెడ్డిపేట, ధారూరు, హరిదాస్‌పల్లి, వట్టి మీనపల్లి సొసైటీ, పూడూరు, మోమిన్‌పేట, పెద్ద మర్పల్లి, మేకవనంపల్లి, బంట్వారం, ఎల్మకన్న, యాలాల, నావన్‌డ్గి, తట్టెపల్లిలో, హుస్నాబాద్‌, దౌల్తాబాద్‌లో, పరిగిలో, కులకచర్లలో, మోత్కుర్‌లో, మెట్ల కుంట, కొత్తగడి, ఎక్‌మామిడిలో, పెద్దేముల్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 286 వార్డులకు ఈనెల 15న పోలింగ్‌ జరుగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపుతోపాటు ఫలితాలను కూడా ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. 


930 నామినేషన్లు...

జిల్లాలో సహకార ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 6 నుంచి ప్రారంభంకాగా శనివారంతో ముగిసింది. అయితే 22 పీఏసీఎస్‌ల్లోని 286 వార్డులకు 930 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా ధారూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధిక మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా ధారూర్‌ మండలంలోనే హరిదాస్‌పల్లి పీఏసీఎస్‌కు కేవలం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్ల దాఖలు చివరి రోజు ఆయా సోసైటీల్లో దాఖలైన నామినేషన్లకు సంబంధించి శివారెడ్డిపేట్‌ సోసైటీకి 54 నామినేషన్లు, కొత్తగడిలో 32, ధారూర్‌లో 76, హరిదాస్‌పల్లిలో 17, పూడూర్‌లో 46, ఎక్‌మామిడిలో 50, వట్టిమీనపల్లిలో 40, మోమిన్‌పేట్‌లో 35, మేకవనంపల్లిలో 35, పెద్ద మర్పల్లిలో 35, బంట్వారంలో 42, పరిగిలో 54, మోత్కూర్‌లో 37, కుల్కచర్లలో 42, మెట్లకుంటలో 40, ఎల్మకన్నెలో 45, యాలాలలో 54, తట్టేపల్లిలో 43, నవాంగిలో 38, పెద్దేముల్‌లో 40, హస్నాబాద్‌లో 22, దౌల్తాబాద్‌లో 41 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే మొదటి రోజు 65, రెండో రోజు 304, ఆఖరి రోజు 561 నామినేషన్లు దాఖలయ్యాయి. 


గత మూడు రోజులుగా దాఖలైన నామినేషన్లను పరిశీలించి, ఏదేని ధృవపత్రాలు లేకపోవడం లేదా నిబంధనల ప్రకారం నామినేషన్‌ పత్రాన్ని పూర్తి చేయకపోయినా సంబంధిత నామినేషన్‌ పత్రాలను తిరస్కరించనున్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణకుగాను రేపటితో గడువు ముగియనుంది. ఆలోపు ఆయా పార్టీల మద్దతుదారులు ఒక్కొ వార్డుకి ఇద్దరు, ముగ్గురు వేసిన నామినేషన్లలో ఆయా పార్టీలు మద్దతిచ్చిన వారు మినహా మిగతా వారు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునేలా ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదేరోజు ఆయా వార్డులో పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. అయితే జిల్లాలోని 22 సహకార సంఘాల్లోని 286 డైరెక్టర్లకు ఈనెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగనుంది. తదనంతరం అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టి అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. logo