సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 09, 2020 , 00:02:48

పల్లె ప్రగతి పనులు భేష్‌..

పల్లె ప్రగతి పనులు భేష్‌..
  • గ్రామాల్లో పారిశుధ్య పనులను కొనసాగించాలి
  • రాష్ట్ర చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి ప్రసాద్‌
  • కోట్‌పల్లి మండలంలో పర్యటన
  • అన్నాసాగర్‌, ఎన్నారం గ్రామాల్లో పనులు పరిశీలన

కోట్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వాతావరణాన్ని నెలకొల్పాలనే సంకల్పంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రగతి పనులను చేయించింది. ఈ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ విజిలెన్స్‌ కమిటీని ఏర్పా టు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే శనివారం మండలంలోని అన్నాసాగర్‌, ఎన్నారం గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేసిన పనులను రాష్ట్ర చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి ప్రసాద్‌ పరిశీలించారు. ఎన్నారం గ్రామంలో స్థానిక సర్పంచ్‌ సావిత్రీదశరత్‌గౌడ్‌లో కలిసి నర్సరీని పరిశీలించి మొక్కలు పెంచే విధానం బాగుందన్నారు. మొక్కలు లేనిదే మానవ మనుగఢ లేదని, మొక్కల పెంపు మానవాళికి ఎంతో అవసరమన్నారు. అనంతరం గ్రామంలో తిరిగి  పాడుపడ్డగోడలను, బావుల తొలిగింపు, ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించడం, శిథిలావస్థకు చేరిన విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, నర్సరీ, డంపింగ్‌ యార్డు, తదితర పనులను పరిశీలించారు. 


పల్లె ప్రగతితో గ్రామాల్లో మంచి వాతావరణం వచ్చిందన్నారు. ఇలాగే మున్ముందు గ్రామంలో చెత్త లేకుండా పరిశుభ్రంగా పెట్టుకోవాలన్నారు. నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకుని గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావాలన్నారు. అనంతరం అన్నాసాగర్‌ గ్రామంలో సర్పంచ్‌ రాధాకృష్ణాతో కలిసి పనులను పరిశీలించారు. 50 శాతం పూర్తి చేసిన ఇంకుడు గుంతలపై స్థానిక సర్పంచ్‌తో మాట్లాడుతూ.. వంద శాతం పూర్తి చేయించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయించాలన్నారు. అందుకు రెగ్యులర్‌గా ఇద్దరు కార్మికులను  సమకూర్చుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేసి, గతంలో గ్రామం ఎలా ఉంది..? పల్లె ప్రగతి పనుల అనంతరం ఎలా ఉంది అంటూ.. ప్రజలను అడుగగా పల్లె ప్రగతి పనులతో గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని ప్రజలు ఆయనతో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏపీవో అంజిలయ్య, డీఎల్‌పీవో తదితరులు పాల్గొన్నారు. 


logo