గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Feb 08, 2020 , 00:01:50

సహకారంలోనూ గులాబీ దూకుడు

సహకారంలోనూ గులాబీ దూకుడు

సహకార ఎన్నికల్లోనూ అధికార పార్టీ ముందంజలో దూసుకెళ్తున్నది. ఈ నెల 15న ఎన్నికలు జరుగనుండగా ఇప్పటికే పీఏసీఎస్‌ల చైర్మన్‌, డైరెక్టర్ల స్థానాలకు అభ్యర్థులను ఎమ్మెల్యేలు దాదాపు ఖరారు చేశారు. పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని డైరెక్లర్ల స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వికారాబాద్‌, తాండూరులో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నేడు ఉదయంలోగా పూర్తి చేయనున్నారు. ఎన్నికల్లో అన్ని సొసైటీల్లో విజయఢంకా మోగించి క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా జిల్లాలోని ఎమ్మెల్యేలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి దిశానిర్దేశం చేశారు. దీంతో 22సొసైటీలను కైవసం చేసుకునే దిశగా అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. రైతుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించుకుంటారనే ధీమాను ఆపార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. కేవలం ఉనికిని కాపాడకోవడం కోసమే కాంగ్రెస్‌, బీజేపీలు సహకార ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 286 డైరెక్టర్లకు ఎన్నికలు జరుగనున్నాయి.

  • 22సొసైటీలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్‌ఎస్‌
  • క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా అధికార పార్టీ వ్యూహం
  • గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతున్న ఎమ్మెల్యేలు
  • అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌ వెతుకులాట
  • నామమాత్రంగా బీజేపీ పోటీ..

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పటికే ఆయా పీఏసీఎస్‌ల చైర్మన్‌ అభ్యర్థులను ఖరారు చేయడంతోపాటు డైరెక్టర్ల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. అయితే పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని పీఏసీఎస్‌ల్లోని డైరెక్టర్ల స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తికాగా, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల్లోని పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నేడు ఉదయంలోగా ఖరారు చేయనున్నారు. అదేవిధంగా జిల్లాలోని 22 సొసైటీలను కైవసం చేసుకునే దిశగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. రైతు సంక్షేమానికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులనే రైతులు గెలిపించుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ శ్రేణులు. మరోవైపు ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించాయి. ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. కేవలం ఉనికిని కాపాడకోవడం కోసమే కాంగ్రెస్‌, బీజేపీలు సహకార ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. అదేవిధంగా జిల్లాలోని శివారెడ్డిపేట, ధారూరు, హరిదాస్‌పల్లి, వట్టి మీనపల్లి సొసైటీ, పూడూరు, మోమిన్‌పేట, పెద్ద మర్పల్లి, మేకవనంపల్లి, బంట్వారం, ఎల్మకన్న, యాలాల, నావన్‌డ్గి, తట్టెపల్లిలో, హుస్నాబాద్‌, దౌల్తాబాద్‌లో, పరిగిలో, కులకచర్లలో, మోత్కుర్‌లో, మెట్ల కుంట, కొత్తగడి, ఎక్‌మామిడిలో, పెద్దేముల్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 286 డైరెక్టర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 

పక్కా వ్యూహంతో టీఆర్‌ఎస్‌

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తుంది. వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార ఎన్నికల్లోనూ గెలుపొందే దిశగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. అయితే సహకార ఎన్నికల్లో అన్ని సొసైటీల్లో విజయఢంకా మోగించి క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి దిశానిర్దేశం చేయడంతో ఆ దిశగా ముందుకెళ్తున్నారు. జిల్లాలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ గెలుపొంది టీఆర్‌ఎస్‌ సత్తాను మరోసారి చూపించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. అయితే అన్ని పీఏసీఎస్‌ల్లోనూ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపేందుకు ఎమ్మెల్యేలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అయితే జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లోనూ గెలుపే లక్ష్యంగా జిల్లాలోని కొడంగల్‌, పరిగి, తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఆయా మండలాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఎవరిని ఎన్నికల బరిలో దింపాలనే దానిపై ఒకట్రెండు సార్లు సమాలోచలు చేసిన అనంతరమే అభ్యర్థులను బరిలో దింపుతున్నారు.

పీఏసీఎస్‌ల చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుంది. జిల్లాలోని 22 సొసైటీలకు చైర్మన్‌ అభ్యర్థులను ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఖరారు చేశారు. అంతేకాకుండా పరిగి నియోజకవర్గ పరిధిలోని నాలుగు సొసైటీలకు చైర్మన్‌ అభ్యర్థులతోపాటు ప్రతి సోసైటీ నుంచి పోటీ చేసే 13 మంది డైరెక్టర్ల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను కూడా స్థానిక ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఇప్పటికే ఖరారు చేశారు. అదేవిధంగా కొడంగల్‌ పరిధిలోని మూడు సొసైటీల్లోనూ అభ్యర్థుల ఎంపిక కసరత్తును స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల పరిధిలోని సొసైటీలకు డైరెక్టర్ల స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తికాగా నేడు ఉదయంలోగా ఆయా సొసైటీల్లో బరిలో ఉండే 13 మంది అభ్యర్థులెవరనేది స్పష్టత రానుంది. కొన్ని సొసైటీల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ ఉండడంతో అనుభవంతోపాటు గెలుపు గుర్రానికే మద్దతిచ్చే విధంగా ఎమ్మెల్యేలు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా నేటితో నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు కోసం ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుంటే చాలు గెలుపు చాలా సులవని గుర్తించిన ఇతర పార్టీల ఆశావహులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం గెలుపు గుర్రాలకు, టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఏదేమైనా టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం మాత్రం పార్టీకి చెందిన వారికే మద్దతిచ్చి ప్రతి పీఏసీఎస్‌లోని 13 పదవులను దక్కించుకునే విధంగా పక్కా గెలుపు వ్యూహంతో ముందుకెళ్తుంది.

మరోవైపు సహకార ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ ఢీలా పడింది. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ ఘోర పరాజయం పాలవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి సహకార ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనే సంకేతాలు ఎన్నికలకు ముందే కనిపిస్తున్నాయి. కనీసం పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెతుకులాట ప్రారంభించారు. అయితే ఏదేమైనా జిల్లాలోని 22 సొసైటీల్లో మొత్తం ప్యానెల్‌ను బరిలో దింపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమి తప్పదనుకున్న కాంగ్రెస్‌ నేతలు ఆయా మండలాల నాయకులకే బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోతుండడంతో చాలా సొసైటీల్లో మొత్తం ప్యానెల్‌కు పోటీ చేసే అవకాశం లేదు. ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్‌, చంద్రశేఖర్‌, టీ.రామ్మోహన్‌రెడ్డి సహకార ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంటూ నామమాత్రంగా ఫోన్‌లోనే చర్చిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బీజేపీ కూడా నామమాత్రంగా పోటీ చేయనుంది. ఒక్క సొసైటీలో కూడా మొత్తంలో ప్యానెల్‌ను బరిలో దింపే క్యాడర్‌, సత్తా లేకపోవడంతో పోటీ చేసిన సొసైటీల్లోనూ నామమాత్రమేనని స్పష్టమవుతుంది. పట్టణ ప్రాంతంలో కొంతమేర బీజేపీకి క్యాడర్‌ ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో క్యాడర్‌ లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండడమే సరైందని యోచనలో ఆ పార్టీ నేతలున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకట్రెండు సొసైటీల్లో కేవలం కొన్ని డైరెక్టర్ల స్థానాలకే పోటీ చేసే అవకాశాలున్నాయి. 


logo