గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Feb 08, 2020 , 00:01:09

పకడ్బందీగా నిర్వహించాలి

పకడ్బందీగా నిర్వహించాలి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో మార్చి 4 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌కు ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లు తిరిగి జరుగకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి సూచించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని, విద్యార్థులను 8:30 గంటలకు పరీక్ష కేంద్రాల వద్ద అనుమతించాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించరాదన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు విద్యుత్‌ నీటి సదుపాయం, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను ఏర్పాట్లు చేయాలన్నారు. ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. 

అనంతరం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ చిత్ర రాంచందర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ వారు సరైన సమాయానికి బస్సులు నడపాలని, పోలీస్‌ శాఖ వారు పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పరీక్ష అనంతరం పోలీస్‌ భద్రతతో పరీక్ష పత్రాలను పోస్టు ఆఫీస్‌కు పంపాలని తెలిపారు. పోస్టు ఆఫీస్‌ వారు ఈ పరీక్ష పత్రాలను స్పీడ్‌ పోస్టు ద్వారా పంపించే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత శాఖలతో వెంటనే సమన్వయ సమావేశం నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. అదే విధంగా జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు మాట్లాడుతూ.. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, ఈనెల 10న సమన్వయ సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్‌, పోస్టల్‌, వైద్య, విద్యుత్‌, ఆర్టీసీ, తదితర శాఖలు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అరుణాకుమారి, ఏఎస్పీ ఎం.ఎ రషీద్‌, డీఆర్‌వో మోతిలాల్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఇంటర్మీడియట్‌ బోర్డు నోడల్‌ అధికారి శంకర్‌నాయక్‌, విద్యుత్‌ శాఖ డీఈ వెంకటచారి తదితరులు పాల్గొన్నారు.


logo