బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Feb 08, 2020 , 00:00:02

రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి

రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి

పెద్దేముల్‌ : రసాయనికి ఎరువులతో భూసారానికి ప్రమాదం వాటిల్లి పంట దిగుబడి తగ్గిపోతుందని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు పొలంలో ఆత్మ అనే సంస్థ ఆధ్వర్యంలో కంది పంటను నాటు పద్దతిలో ఏ విధంగా సాగు చేసుకోవాలో, సేంద్రియ ఎరువులను రైతులే పొలాల వద్ద ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తూ రైతులకు ప్రయోగత్మకంగా అవగాహన కల్పించారు. అదే విధంగా నారాయణ అనే రైతు కంది పంటను నాటు పద్దతిలో సాగుచేసిన విధానాన్ని, షిర్డీ సాయి ఆర్గానిక్‌ వారు తయారు చేసిన డీ కంపోసర్‌ తయారీ, పంటపొలాల్లో వాడే విధానాన్ని రైతులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌ రైతులను ఉద్ధేశించి మాట్లాడుతూ రైతులందరూ కంది పంటను వర్షాధారంగా పండిస్తున్నారని, జిల్లాలో సుమారు 60నుంచి 70% నల్ల రేగడి భూములు ఉన్నాయని, కాలాన్ని అనుసరించి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ తమ పంటపొలాల్లో విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులను వాడుతున్నారని దీంతో భూముల్లో ఉన్న సేంద్రియ కర్బనం అనేది పూర్తిగా తగ్గిపోయి భూమి లోపల పంటలకు కావాలసిన సూక్ష్మక్రిములు నశించిపోతున్నాయని అన్నారు. పంటల్లో మొక్కలకు సుమారు 16రకాల పోషకాలు అవసరమవుతాయని, కేవలం రసాయనిక ఎరువులనే వాడటం వల్ల పంట మొక్కలకు కావాల్సిన పోషకాలు సరియైన మోతాదులో అందడం లేదని అన్నారు. సేంద్రియ ఎరువుల వాడకం లేకపోవడం వల్ల భూములు అన్ని చౌడుబారి పోతున్నాయని, నిస్సారంగా తయారవుతున్నాయని అన్నారు. ఇంకో పది సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగితే భూముల్లో కనీసం గడ్డి కూడా మొలిచే పరిస్థితి కూడా ఉండదని, అందుకు ప్రతి ఒక్క రైతు సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకోవాలని సూచించారు. విత్తనాల రకాలను కాలానికి అనుగుణంగా చూసుకోవాలని, ముఖ్యంగా ఆశ రకం విత్తనాలను వేస్తే ఎండు తెగులు నుంచి కొంచెం విముక్తి లభిస్తుందన్నారు.

హనుమా వెరైటీ విత్తనాలు ఎండు తెగులుతో పాటు, పచ్చ పురుగులను కూడా తట్టుకొంటాయని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి కూడా తప్పకుండా చేయాలని, వేస్ట్‌ డీకంపోసర్‌ను ఉపయోగించుకొని ఎంతైనా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చని, అధిక పంట దిగుబడులకు రుద్రారం రైతు నారాయణ సాగు చేసిన నాటు పద్దతిలో కంది పంట ను సాగు చేస్తే కనుక సుమారు ఎకరానికి 18క్వింటాళ్ల వరకు కందులను పండించవచ్చునని తెలిపారు. అనంతరం నారాయణ రైతులకు సేంద్రి య ఎరువు జీవామృతం తయారు చేసే విధానాన్ని చూపగా షిర్డీసాయి ఆర్గానిక్స్‌ సీఈవో రఘురాం వేస్ట్‌ డీకంపోసర్‌ను తయారు చేసుకొనే పద్దతిని ప్రయోగ పూర్వకంగా చూపించి రైతులకు ఉచితంగా వేస్ట్‌ డీకంపోసర్‌ శాంపుల్స్‌ను అందించారు. రైతులకు కొన్ని సేంద్రియ ఎరువుల కిట్‌లను వై.ఎం ఖాన్‌ ఆయన భార్య జ్ఞాపకార్థం అందించారు. అనంతరం నారాయణ కంది పంటపొలాన్ని అధికారులు, రైతులు పరిశీలించారు. అంతకు ముందు రైతు నారాయణ తాను తయారు చేసి వాడిన సేంద్రియ ఎరువుల గురించి రైతులకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో ఏడీఏ రాథోడ్‌ శంకర్‌, షిర్డీసాయి ఆర్గానిక్స్‌ సీఈవో రఘురాం, వై.ఎం ఖాన్‌, రైతు నారాయణ, కిరణ్‌కుమార్‌ ఆత్మబీ టీం శ్రావణ్‌, ఏటీఎంలు సురేఖ, కేశవకృష్ణ, మండల ఏఈవోలు స్వాతి, బాలు, అనుషా, రుద్రారం, ఆత్కూర్‌ గ్రామాలకు చెందిన రైతులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo