బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Feb 07, 2020 , 00:33:43

తొలిరోజు 65 నామినేషన్లు

తొలిరోజు  65 నామినేషన్లు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలయ్యింది. జిల్లా లో 22సొసైటీలు ఉండగా 268డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 65నామినేషన్లు దాఖలయినట్లు సంబంధిత అధికారులు వెళ్లడించారు. రేపటితో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్న నేపథ్యంలో నేడు, రేపు అధిక మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. గురువారం ఆయా సొసైటీల్లో దాఖలైన నామినేషన్లకు సంబంధించి శివారెడ్డిపేట్ సొసైటీకి 3 నామినేషన్లు, కొత్తగడిలో 6, ధారూర్‌లో 9, హరిదాస్‌పల్లిలో 2, పూడూర్‌లో 4, ఎక్‌మామిడిలో 4, వట్టిమీనపల్లిలో 1, మోమిన్‌పేట్‌లో 1, పెద్ద మర్పల్లిలో 2, బంట్వారంలో 2, పరిగిలో 6, మోత్కూర్‌లో 5, కుల్కచర్లలో 6, మెట్లకుంటలో 1, ఎల్లంకన్నలో 2, యాలాలలో 1, తట్టేపల్లిలో 2, నవాంగిలో 5, దౌల్తాబాద్‌లో 3నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు సహకార ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్ దూసుకుపోతుంది. ఇప్పటికే అన్ని సొసైటీలకు చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్‌ఎస్ డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తయ్యింది. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపే విధంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లోని ఆయా సొసైటీలకు చైర్మన్ అభ్యర్థులతో పాటు డైరెక్టర్ల స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా, తాండూర్ నియోజకవర్గంలోని సొసైటీలకు పోటీ చేసే అభ్యర్థులను నేడు ఖరారు చేయనున్నారు.


logo