గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Feb 07, 2020 , 00:29:57

నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

 నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

పరిగి రూరల్ : రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్ద్దడి రాకుండా  ముందస్తుగా చర్యలు చేపట్టాలని  కలెక్టర్ పౌసుమి బసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గురువారం పరిగి మండలంలోని రంగంపల్లి, రూఫ్‌ఖాన్‌పేట్, సుల్తాన్‌పూర్ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. రూప్‌ఖాన్‌పేట్, రంగంపల్లిలో నర్సరీల నిర్వహణ సంక్రమంగా లేకపోవడం పట్ల  అసహనం వ్యక్తం చేశారు. రూఫ్‌ఖాన్‌పేట్‌లో నర్సరీలో మొక్కలు ఎండిపోయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పీడీని ఆదేశించింది. అలాగే రంగంపల్లి నర్సరీలో విత్తనాలు నాటుట, మొక్కల పెంపకం రిపోర్టును తప్పుగా ఇవ్వడంపై ఆమె మండిపడ్డారు. తప్పుడు రిపోర్టులు అందజేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం   ఇటీవల పల్లె ప్రగతిలో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులు క్రిమిటోరియం, ఇంకుడుగుంతలు, డంపింగ్ యార్డులు, నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న మిషన్ భగీరథ పనులు త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోని వారు కూడా తప్పనిసరిగా తమ ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని స్పష్టం చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టడం ద్వారా నీటి వృథాతో పాటుగా భూగర్భజలాలు పెరుగుతాయని ఆమె ప్రజలకు వివరించారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రధానంగా పారిశుధ్యం, హరితహారం, నర్సరీ, మిషన్ భగీరథ పనులతో పాటుగా మౌలిక వసతుల కల్పన అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.  కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కృష్ణన్, డీపీవో రిజ్వానా, తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీడీవో కృష్ణకుమార్, పరిగి ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఈవోఆర్‌డీ దయానంద్, సర్పంచ్‌లు లక్ష్మీదేవి, నర్సింహులు, పద్మమ్మ, ఎంపీటీసీలు వెంకటరామకృష్ణారెడ్డి, పర్షవేది, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.logo