మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Feb 07, 2020 , 00:28:48

విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

వికారాబాద్, నమస్తే తెలంగాణ : పదో తరగతి విద్యార్థులు బాగా చదవి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉత్తమ ఫలితాలు సాధించాలని జాయింట్ కలెక్టర్ అరుణకుమారి అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ,శిక్షణ తరగతులు నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ అరుణకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు  ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తుందని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాని సూచించారు.   ప్రతి రోజూ ఉదయం 4 గంటలకే లేచి చదువుకుంటే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. జీవితంలో ఎలాంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని స్పష్టం చేశారు. అనంతరం బీసీ సంక్షేమ అధికారి పుష్పలత మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కావొద్దన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువగలుగుతారని తెలిపారు. విద్యార్థుల్లో మనోధైర్యం పెంచి పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకే ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అదే విధంగా షెడ్యూల్డ్ కులాల అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్నారు. పదో తరగతి పరీక్షలకు సమయం తక్కువ ఉన్నందున ఇప్పటి వరకు చదివిన పాఠ్యాంశాలను మరో సారి రివిజన్ చేసుకోవాలని సూచించారు. కార్పొరేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగలని తెలిపారు.  వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి ఫలితాల్లో 10/10  గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ. 5 వేలు అందిస్తానని పరిగి హాస్టల్ సంక్షేమ అధికారి వెంకట్ తెలిపారు. అనంతరం ప్రేరణ తరగతుల శిక్షకుడు సేవక్‌కుమార్ విద్యార్థులకు పరీక్షల్లో ఎలా చదువుకోవాలి, ఒత్తిడిని ఎలా దూరం చేయాలనే అంశాలను వివరించారు.  పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాడు. కార్యక్రమంలో ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల ఏఎస్‌డబ్ల్యూవోలు, హాస్టల్ వార్డెన్లు,  విద్యార్థులు పాల్గొన్నారు. 


logo