బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Feb 06, 2020 , 00:03:08

అందరి సహకారంతోనే.. అభివృద్ధి సాధ్యం

అందరి సహకారంతోనే.. అభివృద్ధి సాధ్యం
  • ప్రతీ గ్రామంలో ఇంకుడుగుంతలు,మరుగుదొడ్లు, హరితహారం పనులు పూర్తి చేయాలి
  • అన్ని గ్రామాలకు రోడ్లు ఏర్పాటు
  • అభివృద్ధి పనులకు జడ్పీ నిధులు మంజూరు
  • పనుల్లో నాణ్యత పాటించకుంటే చర్యలు
  • కొత్త వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • ‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
  • జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి
  • వాడీ వేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం
  • పలు సమస్యల పరిష్కారంలో అలసత్వంపై అధికారులను నిలదీసిన సభ్యులు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అందరి సహకారంతోనే అన్నిరంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పలు సమస్యలపై వాడీ వేడిగా చర్చ కొనసాగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులు అధికారులను నిలదీశారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, విద్యుత్‌, మిషన్‌ భగీరథ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల్లో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్తేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడిందని అన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. 


అభివృద్ధి పనులకు జడ్పీ నిధులు అధికంగా మంజూరు చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా చూడాలని, హరితహారం మొక్కల సంరక్షణ, నర్సరీల ఏర్పాటు పనులను వందశాతం పూర్తి చేయించాలని అన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, ఆనంద్‌, కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ పౌసుమి బసు, జాయింట్‌ కలెక్టర్‌ అరుణకుమారి, జడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణన్‌, ఎంపీపీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. బుధవారం జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి అధ్యక్షతన వికారాబాద్‌ పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులు ఆయా శాఖల అధికారులను నిలదీశారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, విద్యుత్‌, మిషన్‌ భగీరథ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. జిల్లాలోని చాలా మంది రైతులకు రైతుబంధు ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని, రబీ సీజన్‌కు సంబంధించి రైతుబంధు ఆర్థిక సాయం రైతులకు ఎప్పుడు అందుతుందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఇంకా అసంపూర్తిగా మిగిలిన మిషన్‌ భగీరథ పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారంటూ, గ్రామాల్లో వేలాడుతున్న విద్యుత్‌ వైర్లతోపాటు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతి అన్ని గ్రామాల్లో ఎప్పటిలోగా అమల్లోకి తీసుకువస్తారని, మెజార్టీ గ్రామాలకు సరిగ్గా రోడ్డు సౌకర్యం లేకపోవడంపై కూడా సభ్యులు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. 


ప్రధాన అంశాలపై చర్చ...

రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్పుల భారీ నుంచి కాపాడేందుకు అమలుచేస్తున్న రైతుబంధు ఆర్థిక సహాయంపై చర్చ జరిగింది. అయితే ఇప్పటివరకు ఖరీఫ్‌లో చాలా మంది రైతులకు రైతుబంధు సాయం అందకపోవడంతోపాటు రబీ సీజన్‌కుగాను రైతుబంధు సహాయం ఎప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని, త్వరితగతిన అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ఎలాంటి పరిమితి లేకుండా కందులను కొనుగోలు చేయాలని, పరిమితి విధించడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తుందన్నారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి వెంటవెంటనే పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పాత పాసు పుస్తకాలు ఉన్నప్పటికీ సంబంధిత రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయాలన్నారు. 


కలెక్టర్‌ స్పందిస్తూ.. ఆలస్యంకాకుండా పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా మార్కెటింగ్‌ అధికారిని ఆదేశించారు. నిధులు లేని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల అందజేతకు సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయడంలేదని, ప్రతి గ్రామానికి ట్రాక్టర్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జిల్లా కలెక్టర్‌కు సభ్యులు విన్నవించారు. అయితే ప్రధానంగా కొందరు పంచాయతీ కార్యదర్శులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసిన జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని, వారికే అవార్డులు ఇస్తున్నారని దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేయకుండానే బీనామీ పేర్లతో రూ.లక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మోమిన్‌పేట్‌లో వెలిసిన అక్రమ వెంచర్ల నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. మోమిన్‌పేట్‌ పంచాయతీ నుంచి వెళ్లే వృథానీటిని చెరువులోకి కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసే చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా దౌల్తాబాద్‌ ఎంపీవో అవినీతికి పాల్పడుతున్నారని డీపీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని దౌల్తాబాద్‌ జడ్పీటీసీ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న మోమిన్‌పేట్‌-శంకర్‌పల్లి, వికారాబాద్‌-తాండూరు, కేసారం-తోర్‌మామిడి, జిన్‌గుర్తి-తట్టేపల్లి రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సభ్యులు కోరారు. 


నాలుగేండ్లు పూర్తవుతున్న నస్కల్‌ బ్రిడ్జి పూర్తి కాకపోవడంపై సభ్యులు రోడ్లు, భవనాల శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు సరిపడా వైద్యులను, సిబ్బందిని సమకూర్చాలన్నారు. దౌల్తాబాద్‌ మండలంలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో తాండూరు, హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, వైద్యులను, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని దౌల్తాబాద్‌ జడ్పీటీసీ కోరారు. అదేవిధంగా స్థానికంగా ఏ ఒక్క వైద్యుడు కూడా ఉండడంలేదని, ఏదైనా అత్యవసరం వస్తే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సభ్యులు తెలిపారు. మిషన్‌ భగీరథలో భాగంగా తవ్విన రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రతి గ్రామంలోని ఇంటింటికీ తాగునీరందించాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, ఆనంద్‌, కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అరుణకుమారి, జడ్పీ వైస్‌చైర్మన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌, జడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణన్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్‌ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


అందరూ భాగస్వాములు కావాలి

- జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి

జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, అందరి సహకారంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి అన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో హరితహారం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడిందన్నారు. జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో వివిధ పనుల నిమిత్తం రూ.35 లక్షలను మంజూరు చేశామని, అదేవిధంగా జిల్లాలోని చాలా చోట్ల అద్దె భవనాల్లోనే అంగన్‌వాడీ పాఠశాలలు కొనసాగుతున్న దృష్ట్యా కొత్త భవనాలు మంజూరు చేశామని జడ్పీ చైర్‌పర్సన్‌ వెల్లడించారు. జిల్లా పరిషత్‌ నిధుల్లో అధిక నిధులు గ్రామాల అభివృద్ధికే కేటాయిస్తున్నామని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లతోపాటు మురుగు కాల్వల నిర్మాణం పూర్తి చేశామన్నారు. జిల్లాలో వెనుకబడిన మండల పరిషత్‌లకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లను కూడా మంజూరు చేశామన్నారు. 


వ్యవసాయ రోడ్లతోపాటు లింక్‌ రోడ్లకు ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులిస్తున్నామన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్లకు కూడా ప్రతిపాదనలను పెట్టాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని, అంతేకాకుండా రైతు మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియోను కూడా అందిస్తుందన్నారు. మరోవైపు కొత్త కొత్త వ్యాధులు గ్రామాలకు ప్రభలకుండా సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ ఆదేశించారు. ప్రత్యేక ప్రణాళికలను అమలుచేసి ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా అవసరంలేని పనులను రద్దు చేసుకొని, వాటి స్థానంలో కొత్త పనులను మంజూరు చేసుకోవాలని, అయితే పనుల్లో నాణ్యత పాటించనట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 


logo