మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 23:57:35

కష్టపడండి..విజయం మనదే

కష్టపడండి..విజయం మనదే
  • రైతు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది.. ‘సహకార’ంలో తప్పక ఆదరిస్తారు
  • కొత్త పాలక మండళ్ల ఏర్పాటు తర్వాత సమస్యలు పరిష్కరిస్తాం
  • టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

బొంరాస్‌పేట : సహకారం సంఘాల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి చేస్తే విజయం మనదేనని ఎమ్మెల్యే పట్నం నరందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని దీప్లానాయక్‌తండా సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశామని చెప్పారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయం, అన్నదాతలు మరణిస్తే రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నామన్నారు. ఇవే కాకుండా రైతులకు యాసంగి, వానాకాలంలో అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాయని, బ్యాంకులు, సహకారం సంఘాల ద్వారా పంట రుణాలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నందున సహకార ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను తప్పకుండా ఆదరిస్తారని ఎమ్మెల్యే చెప్పారు. రైతులకు అందుబాటులో ఉండి వారి సంక్షేమం కోసం పాటుపడే వారిని ఎన్నికల్లో నిలుపాలని, గురువారం నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్నందున నాయకులు ఏకాభిప్రాయంతో డైరెక్టర్లుగా పోటీ చేసే వారిని నిర్ణయించాలని సూచించారు. చైర్మన్‌ అభ్యర్థిగా కూడా ఎవరు ఉండాలో మీరే నిర్ణయించాలని ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పోటీలో ఎవరు ఉన్న నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలన్నారు. పీఏసీఎస్‌లోని 13 డైరెక్టర్‌ స్థానాల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 


మెట్లకుంట సింగిల్‌విండోలో రైతులకు ఇంతవరకు బీమా డబ్బులు రాలేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని బొంరాస్‌పేట, బురాన్‌పూర్‌ ఎంపీటీసీలు శ్రావణ్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పీఏసీఎస్‌లకు కొత్త పాలకమండళ్లు ఏర్పాటైన తర్వాత డీసీసీబీ ఉన్నతాధికారులను పిలిపించి రైతు సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల వారీగా వచ్చిన రిజర్వేషన్లను సమావేశంలో వివరించి డైరెక్టర్‌ స్థానాలకు పేర్లను ఇవ్వాలని సూచించారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ మహేందర్‌రెడ్డి, సింగిల్‌విండో ఛైర్మన్‌ నారాయణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, తాలుకా యూత్‌ కమిటీ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


logo