ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 23:45:15

ఆదర్శ మున్సిపల్‌కు అందరూ సహకరించండి

ఆదర్శ మున్సిపల్‌కు అందరూ సహకరించండి

తాండూరు, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో తాండూరును ఆదర్శ మున్సిపల్‌గా చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని అందుకు పార్టీలకు అతీతంగా తాండూరులో రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు తాండూరు అభివృద్ధికి సహకరించాలని ఎమ్మె ల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కోరారు. బుధవారం తాండూరు మున్సిపల్‌లో రూ. 2.72కోట్లతో తాండూరులో ఇంటింటికీ చెత్త సేకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, కమిషనర్‌ సాబేర్‌ అలీ, శానిటరి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పల్లెల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అందుకు ప్రజలతో పాటు సంబంధిత శాఖ అధికారులు సహకరించాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ 30రోజుల పల్లెప్రగతితో పాటు 30రోజుల పట్టణ ప్రగతిని నిర్వహించి చరిత్ర సృష్టించారని తెలిపారు. 


దీంతో పల్లెల్లోని కాలనీలు, పట్టణాల్లోని వార్డులు అభివృద్ధి చెందినట్లు తెలిపారు. అంతటితో ఆగకుండా నిరంతరం పల్లె, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశుద్ధ్యం మెరుగు పరుచడంలో భాగంగా చెత్త సేకరణకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌తో పాటు తాండూరు మున్సిపల్‌కు రూ. 2.72కోట్లతో 3ట్రాక్టర్లు, 2టిప్పర్లు, 8విద్యుత్‌ ఆటోలు, 10మహేంద్ర ఆటోలు, 1 జేసీబీ తేవడం జరిగిందన్నారు. ఇంకా అవసరమైన నిధులు తీసుకువస్తామన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పరిమళ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ దీపనర్సింహులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తాండూరు మున్సిపల్‌ పరిధిలోని 36వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్‌ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక నిధులతో ప్రజలకు అన్ని సదుపాయాలను చక్కగ కల్పిస్తామన్నారు. చెత్త సేకరణకు రూ. 2.72 కోట్లతో తీసుకువచ్చిన వాహనాలను సంబంధిత అధికారులు నిత్యం పరిశీలిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. తడి,పొడి చెత్త సేకరణకు ఇంటింటికీ ప్రజలకు ఇచ్చిన చెత్త బుట్టల్లోనే చెత్తను వేసి మున్సిపల్‌ ప్రత్యేక వాహనాల్లోనే చెత్తను వేయాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ పాలకవర్గం సభ్యులు, సిబ్బంది ఉన్నారు. 


logo