ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 00:22:09

గెలుపే లక్ష్యంగా..

గెలుపే లక్ష్యంగా..

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ సన్నద్ధమవుతుంది. వరుసగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించిన టీఆర్‌ఎస్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లోనూ విజయభేరి మోగించేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని సహకార సంఘాలన్నింటిని కైవసం చేసుకునేందుకు ఇప్పటికే మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి గెలుపు వ్యూహాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పూర్తి బాధ్యతలతో నాలుగు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలకే సహకార ఎన్నికల గెలుపు బాధ్యతలను కూడా పార్టీ అధిష్టానం అప్పగించింది. దీంతో కొడంగల్‌, పరిగి, తాండూర్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌ రెడ్డి, కొప్పుల మహేష్‌ రెడ్డి, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, మెతుకు ఆనంద్‌లు ఆయా నియోజకవర్గాల్లోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఛేజిక్కించుకునేలా ఎమ్మెల్యేలు గెలుపు వ్యూహన్ని రచిస్తున్నారు. సహకార ఎన్నికలు పూర్తిగా పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ ఆయా పార్టీలు తమ మద్దతుదారులను రంగంలోకి దింపుతాయి. టీఆర్‌ఎస్‌ అన్ని సహకార సంఘాల్లో గెలుపు గుర్రాలనే బరిలోకి దింపే విధంగా ముందుకెళ్తున్నారు. ఎన్నికలు జరుగనున్న 22ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 286 డైరెక్టర్ల పదవులతో చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల పదవులను దక్కించుకునేలా టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. 

సహకార ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధం...

సహకార ఎన్నికల్లోనూ గెలుపొంది మరోసారి టీఆర్‌ఎస్‌ సత్తా ఎంటో ప్రతిపక్షాలకు చూపించేందుకు సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 22ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. అన్ని పీఏసీఎస్‌ల్లోనూ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపేందుకు ఎమ్మెల్యేలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అన్ని సహకార సంఘాల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించా రు. మరోవైపు జిల్లాలోని కొడంగల్‌, పరిగి, తాండూర్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయా మండలాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఎవరిని ఎన్నికల బరిలో దింపాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. కొన్ని పీఏసీఎస్‌లకు సంబంధించి ఇప్పటికే చైర్మెన్‌ అభ్యర్థులను కూడా ఖరా రు చేశారు. నేడు సాయంత్రంలోగా చైర్మన్‌ అభ్యర్థులతో పాటు డైరెక్టర్ల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. పరిగి నియోజకవర్గంలో నాలుగు పీఏసీఎస్‌లుండగా ఇప్పటికే పరిగి మండ ల కార్యకర్తలతో సహకార ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి, మంగళవారం కుల్కచర్ల మండల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించి గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేశారు. పరిగి నియోజకవర్గంలోని నాలుగు పీఏసీఎస్‌లకు సంబంధించి చైర్మన్‌ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. పూడూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నర్సింహరెడ్డి, పరిగి పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా శ్యాంసుందర్‌ రెడ్డి, కుల్కచర్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా మనోహర్‌ రెడ్డి, దోమ పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రభాకర్‌ రెడ్డిల పేర్లను ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి దాదాపు ఖరారు చేశారు. అదే విధంగా కొడంగల్‌ నియోజకవర్గానికి హస్నాబాద్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిత్వానికి శివకుమార్‌, శ్రీనివాస్‌, దత్తురెడ్డిలు పోటీ పడుతున్నారు. అదే విధంగా బొంరాసుపేట్‌(మెట్లకుంట) పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా మహేందర్‌ రెడ్డితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. దౌల్తాబాద్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రస్తుత చైర్మన్‌ నీలారెడ్డినే చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి నేటి నుంచి ఆయా మండలాల్లో సహకార ఎన్నికల సన్నాహాక సమావేశాలను నిర్వహించి ఆయా మండలాల ముఖ్య నేతలతో సమాలోచనలు చేసి చైర్మన్‌ అభ్యర్థులతో పాటు డైరెక్టర్ల స్థానాలకు ఎవరిని బరిలో దింపాలనేది నిర్ణయానికి రానున్నారు. తాండూర్‌ నియోజకవర్గానికి సంబంధించి మంగళవారం టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో బషీరాబాద్‌ మండలంలో సన్నాహాక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిలు చైర్మన్‌ అభ్యర్థులతోపాటు డైరెక్టర్ల స్థానాలకు అభ్యర్థులు ఎవరిని బరిలో దింపాలనే దానిపై అభిప్రాయాలను సేకరించారు.

పెద్దేముల్‌ ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నారాయణరెడ్డిని ప్రకటించే అవకాశాలున్నా యి. అదే విధంగా బషీరాబాద్‌ మండలంలోని నవాంగి పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిత్వానికి వెంకట్రాంరెడ్డి, రంగారెడ్డి, వీరారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి, వీరి ముగ్గురిలో ఎవరినో ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేయనున్నారు. వికారాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి డైరెక్టర్ల స్థానాలకు అభ్యర్థుల ఎంపికతో పాటు చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఇప్పటికే ఆయా మండలాల ముఖ్య నేతలతో సమావేశమై సమాలోచనలు చేసిన ఎమ్మెల్యే మరోసారి నేడు చర్చించిన అనంతరమే చైర్మన్‌ అభ్యర్థులు, డైరెక్టర్ల స్థానాల్లో ఎవరిని బరిలో దింపుతారనేది కొలక్కిరానుంది. మర్పల్లి మండల పీఏసీఎస్‌ చైర్మెన్‌ అభ్యర్థిగా ప్రవీణ్‌ రెడ్డి పేరు వినిపిస్తుంది, అయితే ఎమ్మెల్యేతోపాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి సమావేశమై చర్చించిన అనంతరమే చైర్మన్‌ అభ్యర్థి ఎవరనేది నిర్ణయించనున్నారు. ఎక్‌మామిడి పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా మల్లారెడ్డి, వట్టిమీనపల్లి పీఏసీఎస్‌ అభ్యర్థిగా రాంరెడ్డి, నాగిరెడ్డిలతోపాటు మల్లారెడ్డి, బంట్వారం పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్థిత్వానికి మధుసూదన్‌ రెడ్డి, బల్వంత్‌ రెడ్డి, సుధాకర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. 

టీఆర్‌ఎస్‌ మద్దతు కోసం ఆశావాహుల ప్రయత్నాలు...

వరుసగా అన్ని ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తున్న టీఆర్‌ఎస్‌ మద్దతు కోసం సహకార ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మద్దతుంటే చాలు గెలుపు చాలా ఈజీ అని గుర్తించిన ఇతర పార్టీల ఆశావాహులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ మాత్రం గెలుపు గుర్రాలకు, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వారికే మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. అంతేకాకుండా ఏ పీఏసీఎస్‌లో బలమైన అభ్యర్థి లేనట్లయితే అక్కడ మరో అభ్యర్థిని బరిలో దింపే యోచనలో ఉన్నారు. ఏదేమైనా టీఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం పార్టీకి చెందిన వారికే మద్దతిచ్చి ప్రతి పీఏసీఎస్‌లోని 13పదవులను దక్కించుకునే విధంగా పక్కా ప్లాన్‌తో కసరత్తు చేస్తుంది. మరోవైపు జిల్లాలోని 22ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 87,635మంది సభ్యులుండగా 63,794 మంది అర్హులైన ఓటర్లున్నారు. జిల్లాలోని పీఏసీఎస్‌లకు సంబంధించి వికారాబాద్‌ శివారెడ్డిపేట, ధారూరు, హరిదాస్‌పల్లి, వట్టి మీనపల్లి సొసైటీ, పూడూరు, మోమిన్‌పేట, పెద్ద మర్పల్లి, మేకవనంపల్లి, బంట్వారం, ఎల్మకన్న, యాలాల, నావన్‌డ్గి, తట్టెపల్లిలో, హుస్నాబాద్‌, దౌల్తాబాద్‌లో, పరిగిలో, కులకచర్లలో, మోత్కుర్‌లో, మెట్ల కుంట, కొత్తగడి, ఎక్‌మామిడిలో, పెద్దేముల్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 286 డైరెక్టర్లకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో 286సహకార సంఘాలుండగా ఓసీ (జనరల్‌)-154, ఓసీ (మహిళ)-22, బీసీ (జనరల్‌) -44, ఎస్సీ (జనరల్‌)-22, ఎస్సీ (మహిళ)-22, ఎస్టీ (జనరల్‌)-44 స్థానాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ అధికారులు నిర్ణయించారు.


logo