బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 00:19:41

విద్యాభివృద్ధికి తోడ్పడడం గొప్ప విషయం

విద్యాభివృద్ధికి తోడ్పడడం గొప్ప విషయం

పరిగి, నమస్తే తెలంగాణ : తాము పుట్టి పెరిగిన గ్రామంలో విద్యాభివృద్ధికి సహకారం అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని ప్రాథమిక పాఠశాలకు అదే గ్రామానికి చెందిన విజయపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డిలు రూ. 3లక్షలు వెచ్చించి ఫెన్సింగ్‌, గేటు ఏర్పాటు, డ్యూయల్‌డెస్క్‌లు, పెయింటింగ్‌, డ్రమ్స్‌, మైక్‌సెట్‌, డిజిటల్‌ క్లాస్‌ కోసం ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేయించారు. మంగళవారం జరిగిన వాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన డబ్బులలో ఎంతోకొంత గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తే గ్రామాలన్ని మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. విజయపాల్‌రెడ్డి-నర్సింహారెడ్డి సోదరులు రూ. 3లక్షలతో గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని, ప్రజల భాగస్వామ్యంతో మరింత ప్రగతి సాధ్యమన్నారు. దాతలు ముందుకు వచ్చి గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యాభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రభుత్వం గురుకులాల ఏర్పాటుతో పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచితంగా విద్య అందుతుందన్నారు. సర్కారు కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకొని మరింత ఉత్తమ ఫలితాలు సాధించాలని  ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌, దోమ, పరిగి జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి. హరిప్రియ, ఎంపీపీ కె. అరవిందరావు, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌లు మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధి ద్వారానే ఏ ప్రాంతమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పాఠశాలలో వసతుల కల్పనకు గ్రామస్తులు తోడ్పాటు అందించడం అభినందనీయమని అన్నారు. దాతలు విజయపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డిలు మాట్లాడుతూ తాము జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగడానికి అనేక మంది కారణమని, గ్రామానికి ఎంతోకొంత చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో వసతుల కల్పనకు ముందుకు వచ్చామన్నారు. 

తమకు లక్ష్మీదేవిపల్లి, నారాయణపూర్‌ రెండు గ్రామాలు ఒకటేనని, రెండో విడుతలో నారాయణపూర్‌లోని పాఠశాలను దత్తత తీసుకొని పాఠశాలలో వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. తమ ఎదుగుదలలో తోడ్పాటు అందించిన వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. 

కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌. ఆంజనేయులు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు హఫీజ్‌, సర్పంచ్‌ నిదురం రేణుక, ఎంపీటీసీ కె. వెంకట్‌రాంరెడ్డి, నార్మాక్స్‌ డైరెక్టర్‌ పి. వెంకట్‌రాంరెడ్డి, ఎంఈవో హరిశ్చందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎ. గోపాల్‌, అన్వర్‌హుస్సేన్‌, వెంకటేశ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 

లక్ష్మీదేవిపల్లికి ట్రాక్టర్‌ అందజేత 

పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీకి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను మంగళవారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అందజేశారు. గ్రామ సర్పంచ్‌ నిదురం రేణుకకు ఎమ్మెల్యే ట్రాక్టర్‌ తాళాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు.


logo