శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 03, 2020 , 23:46:06

సహకార ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేస్తాం

సహకార ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేస్తాం

పరిగి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం పరిగిలో సహకార ఎన్నికల సన్నాహకంగా మండల టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని మరింత బలపరుస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటనే ఉన్నారని, ప్రతి ఎన్నిక ద్వారా రుజువయ్యిందన్నారు. మండల పరిధిలోని 13 ప్రాదేశిక నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. పీఏసీఎస్‌ ఎన్నికల్లో తక్కువ సంఖ్యలో ఓట్లు ఉంటాయని, ప్రతి ఓటు కీలకమని ఆయన చెప్పారు. ప్రతి ఓటరును కలిసి ఓటు వేయాల్సిందిగా కోరడంతో పాటు వారికి ఆయా వార్డుల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు వచ్చిన గుర్తును స్పష్టంగా తెలియజేయాలన్నారు. రైతాంగ సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడం ద్వారా రైతాంగం మద్దతు పొందాలన్నారు. 


రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిందన్నారు. అనేక బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని మరింత బలపరచడం ద్వారా రాబోయే నాలుగేళ్లు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేసేందుకు మద్దతుగా నిలువాలని ఆయన రైతులను కోరారు. పీఏసీఎస్‌ పరిధిలోని అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌.ఆంజనేయులు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు హఫీజ్‌, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎ.సురేందర్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ కె.సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌వర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.   

తాజావార్తలు


logo