మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 02, 2020 , 23:32:16

సహకార సమరం షురూ

సహకార సమరం షురూ
  • 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ
  • 9న పరిశీలన, 10న ఉపసంహరణ
  • 15న పోలింగ్‌, అదేరోజు ఓట్ల లెక్కింపు
  • జిల్లాలో 22 సహకార సంఘాలు, 67,423 మంది ఓటర్లు

పరిగి, నమస్తే తెలంగాణ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. తద్వారా సహకార సమరానికి తొలిఘట్టం ప్రారంభమవుతుంది. ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్న అధికారులు, ఓటర్ల జాబితా ఆలస్యం, ఇతర కారణాలతో రిజర్వేషన్ల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ సోమవారం ఉదయం లోపు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. కొన్ని చోట్ల రిజర్వేషన్లు విడుదల చేసినప్పటికీ సోమవారం ఉదయానికి అన్ని రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా పరిధిలో 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో మొత్తం 87,135 మంది సభ్యులుండగా వారిలో 67,423 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సహకార సంఘాల్లో ఓటర్లు తమ ఓటు వినియోగించుకోనున్నారు. 


సహకార సంఘాలలో నేడు నోటిఫికేషన్‌...

జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సోమవారం సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేపట్టారు. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రత్యేకంగా ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమించడం జరుగుతుంది. ఆయా సహకార సంఘాలలోని అన్ని డైరెక్టర్‌ పదవులకు సంబంధిత సహకార సంఘంలోనే నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా విధించారు. 15న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌, అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు. జిల్లా పరిధిలో వికారాబాద్‌ శివారెడ్డిపేట, ధారూర్‌, హరిదాస్‌పల్లి, వట్టి మీనపల్లి, పూడూరు, మోమిన్‌పేట, పెద్ద మర్పల్లి, మేకవనంపల్లి, బంట్వారం, ఎల్మకన్న, యాలాల, నావన్‌డ్గి, తట్టెపల్లి, హుస్నాబాద్‌, దౌల్తాబాద్‌, పరిగి, కులకచర్ల, మోత్కూర్‌, మెట్లకుంట, కొత్తగడి, ఎక్‌మామిడి, పెద్దేముల్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 87,135 మంది సభ్యులుండగా, 67,423 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో కొత్తగా మరో 14 సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలకే ఎన్నికలు జరుగుతాయి. ఇకపోతే ఎన్నికలు బ్యాలెట్‌ పద్దతిలో కొనసాగించేందుకు అధికారులు నిర్ణయించారు. పార్టీ రహితంగా సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల బ్యాలెట్‌ పేపర్లలో పార్టీలకు చెందినవి కాకుండా స్వతంత్ర గుర్తులు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆయా గుర్తులు కేటాయించడం జరుగుతుంది. సహకార సంఘాల ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు సైతం సిద్ధం చేయడం జరుగుతుం ది. ఒకటిరెండు రోజుల్లో బ్యాలెట్‌ బాక్సులను ఆయా సహకార సంఘాలకు తరలిస్తారు.  


కొలిక్కిరాని రిజర్వేషన్ల ప్రక్రియ...

సహకార సంఘాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలవనుండగా రిజర్వేషన్ల ప్రక్రియ ఆదివారం రాత్రి వరకు కొలిక్కి రాలేదు. ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలోని ఓటర్ల జాబితాకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎదురైన ఇబ్బందులతోనే రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సైతం అన్ని సహకార సంఘాల రిజర్వేషన్‌లు వెలువడే అవకాశం లేకపోవడంతో సోమవారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదలయ్యే లోపు రిజర్వేషన్‌లు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఆయా సొసైటీలోని డైరెక్టర్‌ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధిత సొసైటీలోని ఆయా వర్గాల ఓటర్ల సంఖ్య ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. అందువల్ల పూర్తిస్థాయి ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాల ఆధారంగా ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు సహకార సంఘాల అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే పెద్దేముల్‌ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘంలో మొత్తం 13 డైరెక్టర్‌ పదవులకు, బషీరాబాద్‌ నవాంద్గి సహకార సంఘం 13 డైరెక్టర్ల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మరోవైపు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ ఈనెల 6వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనుండడంతో ఆయా స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు రాజకీయ పార్టీలకు సమయం లభిస్తుంది. ఇప్పటికే అన్ని ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతుంది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార సంఘాల ఎన్నికల్లోను అదే దూకుడు ప్రదర్శించనుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు సైతం దొరకని పరిస్థితి నెలకొంది.  


logo