ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 01, 2020 , 23:44:15

స్వచ్ఛ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుకోవాలి

స్వచ్ఛ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుకోవాలి

వికారాబాద్‌ టౌన్‌: మున్సిపల్‌ పరిధిలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలించాలని కలెక్టర్‌ మస్రత్‌ ఖామమ్‌ ఆయేషా సూచించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫెరెన్స్‌ హాల్‌లో కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, మెఫ్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ తడి, పొడి చెత్త సేకరణకు విడి విడిగా చెత్త బుట్టలను పంపిణీ చేయాలని తెలిపారు. సానిటేషన్‌ జవాన్లకు, చెత్త సేకరణ సిబ్బందికి తడి, పొడి చెత్త పై శిక్షణ ఇవ్వాలన్నారు. గృహిణులు కూడా చెత్తను వేర్వేరుగా అందిస్తేనే చెత్తను తీసుకెళ్తామని సూచించాలని సిబ్బందికి తెలియాజేయాలన్నారు. కంపోస్ట్‌ ఎరువులు తయారు చేయాడం కోసం చెత్తను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో షీ మూత్రశాలల నిర్మాణం చేపట్టాలన్నారు.  ప్లాస్టిక్‌ వినియోగ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఫిబ్రవరి మాసంతం వరకు అన్ని మున్సిపాటీలో అన్ని టాక్స్‌ కలెక్షన్లు వసూళ్లు చేయాలని అన్నారు. టాక్స్‌ కలెక్షన్‌ చెల్లించని వారికి విద్యుత్‌, నీటి సరఫరా నిలిపి వేస్తామని హెచ్చరించాలని తెలిపారు. 


ట్యాక్స్‌ రూపంలో వచ్చే నిధులతో పట్టణాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలవుతుందని తెలిపారు. హరితహారం పల్లె ప్రాంతాల్లోలాగే పట్టణాల్లో కూడా నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి నీరు పోసి రక్షించాలని సూచించారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటి ట్రీగార్డ్‌ అమర్చి నీరు పోసి రక్షించే బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లదే అని  స్పష్టం చేశారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు అవసరమైన మొక్కలను అటవీ శాఖ అధికారుల నుంచి సేకరించుకోవాలని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నర్సరీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పండ్లు, పూల మొక్కల విత్తనాలను సేకరరించి నర్సరీల్లో  పెంచాలని తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్లు, చైర్మన్లు పాల్గొన్నారు.


logo