శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Feb 01, 2020 , 00:31:24

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు
  • ఫిబ్రవరి 20వరకు కొనసాగనున్న పరీక్షలు
  • ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు
  • హాజరుకానున్న 5,069మంది విద్యార్థులు
  • జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నేటి నుంచి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగనున్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 20 వరకు జరుగనున్న ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో జరుగనున్న ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలకు రెగ్యులర్‌, ఓకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 5,069 మంది హాజరుకానున్నారు, వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 3,391 మందికాగా ఓకేషనల్‌ 1,678 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ప్రాక్టికల్స్‌ జరుగనున్న దృష్ట్యా పరీక్షా సమయానికి అర్ధగంట ముందు ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. 


సంబంధిత ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకునేందుకుగాను ఎగ్జామినర్‌ కోడ్‌, ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేస్తారు. ఎగ్జామినర్‌ ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసిన అనంతరం బ్లాక్‌ బోర్డుపై రాస్తారు. బ్లాక్‌బోర్డుపై రాసిన ప్రశ్నాపత్రం ఆధారంగా విద్యార్థులు ప్రాక్టికల్స్‌ చేయనున్నారు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ, అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2 గంటల వరకు ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్‌ చేసుకోవడం, మ.2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది. అదేవిధంగా ప్రాక్టికల్‌ పరీక్ష జరిగిన అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి మార్కులను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు.


కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు...

ఈ ఏడాది మార్చి 4 నుంచి ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ప్రతి విద్యార్థి మెరుగైన ఫలితాలతో ఉత్తీర్ణులయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నవంబర్‌లోనే సెలబస్‌ పూర్తి కావడంతో డిసెంబర్‌ నుంచి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు గంటలపాటు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రత్యేక తరగతుల్లో భాగంగా రోజుకొక సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది అధిక మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యే ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులపై ఇంటర్మీడియట్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా 90 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించే విధంగా ఎప్పటికప్పుడు విద్యార్థులను ఆయా పరీక్షలను ఇప్పటికే నిర్వహించారు. ప్రతీరోజు ప్రతి సబ్జెక్టు బోధన పూర్తి అయిన వెంటనే పదిహేను నిమిషాల పాటు స్టడీ అవర్‌ కూడా నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో యూనిట్‌ టెస్ట్‌లతోపాటు అర్ధ సంవత్సర పరీక్షలను కూడా నిర్వహించడంతోపాటు ఇప్పటివరకు ప్రతి జూనియర్‌ కాలేజీల్లో పది స్లిప్‌ టెస్ట్‌లతోపాటు ఫ్రీ ఫైనల్‌ పరీక్షలను కూడా నిర్వహించారు. 


అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు మహార్దశ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుండడంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అంతేకాకుండా కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సకల వసతులు కల్పిస్తూ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు పూర్వ వైభవం తీసుకువచ్చింది. కార్పొరేట్‌, ప్రైవేట్‌ కాలేజీల్లో కంటే మంచి విద్యార్హతలు కలిగిన అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉండడం, సొంత భవనాలు ఉండడం, ఉచిత విద్య, ఉచితంగా పుస్తకాలు తదితర వసతులు కల్పిస్తుండడంతో తిరిగి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల వైపు అడుగులు వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతానికిపైగా విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరడం గమనార్హం. జిల్లాలోని 9 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 5,103 మంది విద్యార్థులు ఉన్నారు. నవాబుపేట్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 145 మంది, మోమిన్‌పేట్‌ 186 మంది, మర్పల్లిలో 337 మంది, తాండూరులో 2243 మంది, పెద్దేముల్‌లో 249 మంది, పరిగిలో 390 మంది, వికారాబాద్‌లో 460 మంది, కొడంగల్‌లో 691 మంది, దోమ మండలంలో 402 మంది  విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా మంచి మేధోవంతులైన అధ్యాపకులు ఉండడంతో పలు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం ప్రైవేట్‌ కాలేజీల కంటే అదనంగా సర్కార్‌ జూనియర్‌ కాలేజీల విద్యార్థులు సాధిస్తున్నారు. 


అంతేకాకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కాలేజీల్లో చేర్చుకోవడం, ఉచితంగా అన్ని కోర్సులకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా అందజేయడం, ప్రాక్టికల్స్‌కు సంబంధించి ల్యాబ్‌ మెటీరియల్‌ అందజేయడం, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానంతో రోజురోజుకు విద్యార్థుల శాతం పెరుగుతుంది. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తుండడంతో అధ్యాపకులు, విద్యార్థులు గైర్హాజరు కాకుండా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ప్రతి కాలేజీకి 4 సీసీ కెమెరాలను ప్రభుత్వం అందించడంతో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే జిల్లాలోని వికారాబాద్‌, పరిగి, నవాబుపేట్‌, మోమిన్‌పేట్‌, మర్పల్లి, పెద్దేముల్‌, తాండూరు, కొడంగల్‌, దోమ మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలున్నాయి. అయితే నవాబుపేట్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోనే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండగా తాండూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు సరిపోను అధ్యాపకులు కూడా ఉన్నారు. ప్రభుత్వ లెక్చరర్లు, కాంట్రాక్టు లెక్చరర్లతో బోధన జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ కాలేజీలో అయితే జిల్లా సగటు మార్కుల కంటే తక్కువగా వచ్చినట్లయితే ఆయా సబ్జెక్టులను బట్టి కాంట్రాక్టు లెక్చరర్లు రెన్యూవల్‌ చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లా సగటు మార్కుల కంటే అధికంగా వస్తేనే సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులను కొనసాగించనున్నారు. 


logo