శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jan 30, 2020 , 23:28:14

సహకార నగారా

సహకార నగారా
  • పీఏసీఎస్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
  • ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌
  • 6 నుంచి 8వరకు నామినేషన్ల పర్వం
  • 9న పరిశీలన, 10న ఉపసంహరణ
  • 15న పోలింగ్‌.. అదేరోజు కౌంటింగ్‌.. ఫలితాలు
  • జిల్లాలోని 22 సహకార కేంద్రాల్లో 87,135మంది సభ్యులు.. 67,423మంది ఓటర్లు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. గురువారం రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసి, 6 నుంచి 8వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 9న పరిశీలన, 10న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం 15న ఎన్నికలు జరుగనున్నాయి. అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పీఏసీఎస్‌లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో  నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 22 సహకార సంఘాలు ఉన్నాయి. 


ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 15న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియతోపాటు ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు సహకార ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3న సంబంధిత ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. తదనంతరం ఫిబ్రవరి 6నుంచి 8వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న నామినేషన్లను పరిశీలించనున్నారు. అదేవిధంగా వచ్చే నెల 10తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. పర్సన్‌ ఇన్‌చార్జిల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన ఒక్కరోజులోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. సహకార ఎన్నికల ప్రక్రియ సరిగ్గా 15 రోజుల్లో పూర్తి చేసేలా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే సహకార ఎన్నికల నిర్వహణకుగాను సంబంధిత జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అయితే ప్రస్తుతమున్న సహకార సంఘాలకే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటుకానున్న సహకార సంఘాలకు కూడా ఎన్నికలను నిర్వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటికే ఉన్న సహకార సంఘాలకు మాత్రమే ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయించారు. మరోవైపు జిల్లాలో 22ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనుండగా, జిల్లావ్యాప్తంగా ఆయా సంఘాల్లో 87,135మంది సభ్యులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. 


జిల్లాలో 22 పీఏసీఎస్‌లకు ఎన్నికలు..

జిల్లాలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలను నిర్వహించేందుకుగాను జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. అయితే మొదట ఓటరు జాబితాను ప్రకటించనున్న దృష్ట్యా జిల్లాలో సహకార సంఘాల్లోని మొత్తం సభ్యులు, అందులో అర్హులైన వారు ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే 2018 డిసెంబర్‌ వరకు గల అర్హులైన సభ్యులను ఓటర్లుగా పరిగణించే అవకాశముంది. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది ఫిబ్రవరి 3తో గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకుగాను నిర్ణయించినప్పటికీ వరుసగా ఎన్నికలు రావడంతో సహకార ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఓటరు జాబితాతోపాటు బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు తదితర ఏర్పాట్లు చేసినప్పటికీ పంచాయతీ ఎన్నికలతో వాయిదా వేయడం జరిగింది. మరోవైపు పంచాయతీ ఎన్నికల అనంతరం పీఏసీఎస్‌ల ఎన్నికలను నిర్వహించాలని అనుకున్నప్పటికీ పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా పీఏసీఎస్‌ల పదవీ కాలాన్ని మరో ఆరుమాసాలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి నెలాఖరులో పర్సన్‌ ఇన్‌చార్జిల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని పీఏసీఎస్‌లకు సంబంధించి వికారాబాద్‌ శివారెడ్డిపేట, ధారూరు, హరిదాస్‌పల్లి, వట్టి మీనపల్లి సొసైటీ, పూడూరు, మోమిన్‌పేట, పెద్ద మర్పల్లి, మేకవనంపల్లి, బంట్వారం, ఎల్మకన్న, యాలాల, నావన్‌డ్గి, తట్టెపల్లిలో, హుస్నాబాద్‌, దౌల్తాబాద్‌లో, పరిగిలో, కులకచర్లలో, మోత్కుర్‌లో, మెట్లకుంట, కొత్తగడి, ఎక్‌మామిడిలో, పెద్దేముల్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. 


87,135మంది సభ్యులు...

జిల్లాలోని 22సహకార సంఘాల్లో 87,135మంది సభ్యులుండగా 67,423మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు జిల్లా సహకార శాఖ అధికారులు ప్రాథమికంగా లెక్కతేల్చారు. శివారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 5,320మంది సభ్యులుండగా 3,334 మంది అర్హులు, ధారూర్‌ పీఏసీఎస్‌లో 6,151మంది సభ్యులుండగా 5083మంది, హరిదాసుపల్లిలో 518మంది సభ్యులుండగా 480 మంది, వట్టిమీనపల్లిలో 4,252మంది సభ్యులకు 3,902మంది, పూడూరులో 5,450మంది సభ్యులుండగా 4,641మంది, మోమిన్‌పేట్‌లో 3,862మంది సభ్యులకు 3,514మంది, పెద్ద మర్పల్లిలో 6,150మంది సభ్యులుండగా 4,660మంది, మేకవనంపల్లిలో 1,724మంది సభ్యులకు 1,600మంది, బంట్వారంలో 3,973మంది సభ్యులుండగా 3,411మంది, ఎల్లంకన్నలో 2,981మంది సభ్యులకు 2,500, యాలాలలో 4,567మంది సభ్యులుండగా 3,172, నవాంగిలో 4,780మంది సభ్యులుండగా 4,170మంది, తట్టేపల్లిలో 2,250మంది సభ్యులుండగా 1,800మంది, హస్నాబాద్‌లో 2,400మంది సభ్యులుండగా 2,400మంది, దౌల్తాబాద్‌లో 6,229మంది సభ్యులుండగా 4,800మంది, పరిగిలో 3,516మంది సభ్యులుండగా 3,516మంది, కుల్కచర్లలో 5,270మంది సభ్యులుండగా 4,592మంది, మోత్కూరులో 5,574మంది సభ్యులుండగా 4,296మంది, మెట్లకుంటలో 3,400మంది సభ్యులుండగా 2,000మంది, కొత్తగడిలో 1,280మంది సభ్యులుండగా 846మంది, ఎక్‌మామిడిలో 995మంది సభ్యులుండగా 756 మంది, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ పెద్దేముల్‌లో 6,493మంది సభ్యులుండగా 1,950మంది అర్హులైన ఓటర్లున్నట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కతేల్చారు. అయితే సంబంధిత ఓటర్లకు సంబంధించి 74,168బ్యాలెట్‌ పత్రాలు అవసరమని అంచనా వేసిన అధికారులు బ్యాలెట్‌ పేపర్లను కూడా సిద్ధం చేశారు. అయితే సహకార ఎన్నికల్లో పార్టీల వారీగా ఎన్నికలు కాకుండా అభ్యర్థుల వారీగా ఎన్నికలు జరుగతాయి. బ్యాలెట్‌ పత్రాల్లో ఆయా పార్టీల గుర్తులు కాకుండా స్వతంత్ర గుర్తులు ఉంటాయి. 


కొత్త పీఏసీఎస్‌లకు ఎన్నికలు లేనట్లే..

కొత్తగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన సహకార సంఘాలకు ఎన్నికలు లేనట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లాలోని కొత్తగా 14 సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకుగాను ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేయగా అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఫిబ్రవరి 9తో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. అయితే ఒకవేళ పాత సంఘాలతోపాటు కొత్తవాటికి ఎన్నికలను నిర్వహించాలంటే ఫిబ్రవరి రెండో వారం తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొత్త సంఘాల ఏర్పాటు పక్కనబెట్టిన ప్రభుత్వం ఇప్పటికే ఉన్న సంఘాలకు ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులకు పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా కొత్త సంఘాల ఏర్పాటు ప్రక్రియ కూడా సందిగ్ధంలో పడింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన జిల్లాలో కొత్త సహకార సంఘాలకు సంబంధించి రొంపల్లి, కోటపల్లి, నాగ్‌సాన్‌పల్లి, చౌడాపూర్‌, దోమ, అంగడిచిట్టంపల్లి, పట్లూరు, గౌరారం, రాఘవాపూర్‌, తాండూరు, కోకట్‌, కసీంపూర్‌, గోకఫస్లాబాద్‌, రావులపల్లిలో కొత్తగా పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసేందుకుగాను ప్రతిపాదనలు పంపడంతోపాటు నోటిఫికేషన్‌ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కొత్త సహకార సంఘాల ఏర్పాటు ప్రశ్నార్ధకంగా మారిందనే చెప్పొచ్చు.


logo