గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jan 30, 2020 , 23:26:08

ఎస్‌ఏపీ కళాశాల సేవలు మరువలేనివి

ఎస్‌ఏపీ కళాశాల సేవలు మరువలేనివి

వికారాబాద్‌ టౌన్‌ : శ్రీఅనంతపద్మనాభ కళాశాలను యూనివర్సిటీగా మార్చేందుకు కృషి చేస్తానని, అనంత పద్మనాభ కళాశాల సేవలు మరవలేనివని, అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కళాశాలను ఎవ్వరూ మరువొద్దని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం వికారాబాద్‌ పట్టణంలోని శ్రీఅనంతపద్మనాభ ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాలలో స్వర్ణోత్సవం, మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు ఎన్‌సీసీ విద్యార్థులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. మహాత్మగాంధీ వర్ధంతి, మర్రి చెన్నారెడ్డి శత జయంతి కావడంతో ఇద్దరి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఏపీ కళాశాల స్థాపించి 50ఏండ్లు పూర్తయిందని, ఎంతోమంది మేధావులను కళాశాల సమాజానికి అందించిందన్నారు. ఈ కళాశాలను ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మర్రి చెన్నారెడ్డి గొప్ప రాజకీయవేత్త అని, రాష్ర్టానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. 


తెలంగాణ గళాన్ని మొదటి సారిగా చాటిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రిగానే కాకుండా వివిధ రాష్ర్టాలకు గవర్నర్‌గా ఉండి కూడా ప్రజలకు సేవ చేయడం జరిగిందన్నారు. గత 50ఏండ్ల కాలంలో వికారాబాద్‌ చాలా వెనుకబడి ఉండేదని, దానిని గ్రహించి కళాశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కళాశాల ప్రారంభించిన సమయంలో 140మంది విద్యార్థులతో ప్రారంభమై, ఇప్పడు దాదాపు 2వేలకు పైగా విద్యార్థులకు చదువులను బోధించడం జరుగుతుందన్నారు. పూర్వ విద్యార్థులకు ఎంతో మందికి ఉన్నత లక్ష్యాల వైపు బాటలు వేసిందని తెలిపారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం ఈ కళాశాలలో చదవడం జరిగిందని తెలిపారు.  తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఎస్‌ఏపీ కళాశాల యూనివర్సిటీగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.


కళాశాల అభివృద్ధికి సహకారమందించాలి

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు అందించాలని కోరారు. కళాశాల అభివృద్ధి కోసం రాజకీయ నాయకులు పాటు పడాలని తెలిపారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ 1972నుంచి 1975వరకు ఈ కళాశాలో విద్యను అభ్యసించడం జరిగిందన్నారు. ఉద్యమాలను నేర్పిన ఈ కళాశాలను ఎప్పుడు కూడా మార్చిపోలేనని అన్నారు. విద్యార్థి దశలోనే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించేలా కృషి చేశామని పేర్కొన్నారు.  కళాశాలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తప్పక కృషి చేస్తామన్నారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే అనంద్‌ మాట్లాడుతూ 1991నుంచి 93వరకు ఇంటర్‌ విద్యను ఎస్‌ఏపీ కళాశాలలో చదవడం జరిగిందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ వీరయ్య తానే స్వయంగా దరఖాస్తు ఫారం నింపి మెడికల్‌ కోర్స్‌ వైపు పంపించడం జరిగిందన్నారు.  చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ ఎస్‌ఏపీ కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచంలో చాలా మంది ఉన్నతస్థాయిలో ఉన్నారన్నారు. 


ముందుచూపు ఉన్న నాయకుడని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అన్నారు. ఆయన జీవిత చరిత్రను ప్రజలందరూ తెలుసుకోవాలని తెలిపారు. అనంతరం మర్రి చెన్నారెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ ఆవిష్కరించారు. అలాగే కళాశాలలో వాటర్‌ షెడ్డు, లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. ఈ ర్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ సభ్యులు విఠల్‌,  టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, వికాస మండలి అధ్యక్షులు శశిధర్‌రెడ్డి, పర్యావరణ పరిరక్షణ సైంటిస్ట్‌ పురుషోత్తం, కళాశాల ప్రిన్సిపాల్‌ మందారిక, కళాశాల యాజమాన్యం, ప్రొఫెసర్స్‌,  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo